హైదరాబాద్ నాగోలు బంగారు దుకాణంలో దుండగుల కాల్పులు... స్నేహపురికాలనీలో మహదేదవ్ జువలరీస్‌లో ఘటన
* షాపు షట్టర్ మూసేసి దోపిడీకి యత్నం... అడ్డుకునేందుకు ప్రయత్నించిన యజమానిపై కాల్పులు
Gun Fire By Thugs: హైదరాబాద్ నాగోల్ స్నేహపురికాలనీలో కాల్పులు కలకలం రేపాయి. మహదేవ్ జువలరీస్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. దుకాణ యజమాని కళ్యాణ్‌పై కాల్పులు జరిపి బెదిరించిన దుండగులు షాపులో బంగారం ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో షాపుయజమాని కళ్యాణ్ సింగ్‌తోపాటు షాపులో పనిచేసే మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన కళ్యాణ్‌ను ఆస్పత్రికి తరలించారు. బంగారు షాపులో దుండగుల కాల్పులతో అక్కడి పరిసరాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కాల్పుల శబ్దం వినిపించడంతో చుక్కపక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. దుండగుల ఆచూకీకోసం సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం పరిసర పోలీసు స్టేషన్లను అప్రమత్తంచేశారు.
జ్యువలరీ షాపు కాసేపట్లో మూసి ఇంటికి వెళ్లాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా షాపులోకి చొరబడిన దుండగులు యజమానిని బెదిరించే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. 3 పర్యాయాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో షాపు యజమాని కళ్యాణ్ సింగ్, షాపులో పనిచేసే మరో వ్యక్తి గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
స్నేహపురి మహదేవ్ జువలరీస్‌లో దుండగుల కాల్పులు, దోపిడీపై రాజచకొండ జాయింట్ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేక దృష్టిసారించారు. బంగారంషాపులోకి ఇద్దరు చొరబడినట్లు గుర్తించారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. అక్కడ ఆధారాలు సేకరించారు. షాపులో పడి ఉన్న రెండు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్ షాప్‌లో దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని.. ఈ దుండగులు ఫాలో అయ్యారు. బంగారు నగలు కొనుగోలు చేసేందుకుకు వచ్చినట్లు షాపులోకి దూరిన దుండగులు, దుకాణ షట్టర్స్‌ను క్లోజ్ చేసి బెదిరింపులతో కాల్పులు జరిపారు. ఆభరణాలని కళ్యాణ్ సింగ్‌కి ఇస్తున్న సమయంలో దుండగులు నగలు లాక్కున్నట్లు సమాచారం. బంగారం తీసుకొని దుండగులు పారిపోతున్న సమయంలో.. స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఫలితం లేకుండా పోయింది. పక్క వీధిలో పార్క్ చేసిన మోటర్ బైక్‌పై పారిపోయారు.
15 పోలీసు బృందాలను ఏర్పాటుచేసి నిందితులను పట్టుకోడానికి గాలింపు చర్యలు చేపట్టారు. కంట్రీ మేడ్ పిస్టల్‌తో దుండగులు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దుండగులు రాజాస్థాన్, హర్యానా, యూపీ గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పల్సర్ బైకు, మరో యాక్టివా బైక్‌పై దుండగులు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. సీసీకెమరా ఫుటేజి ఆధారంగా నిందితుల ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు అధికారులు చెబుతున్నారు.