తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీపై జాప్యం
Telangana: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీలు ప్రతిపాదనలు పంపినా ఆమోదముద్ర వేయని సర్కారు
Telangana: తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీపై జాప్యం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీలు అన్ని రకాల ప్రతిపాదనలు పంపినా సర్కారు ఆమోద ముద్ర వేయడం లేదు. నెలల తరబడి ఫైల్ ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉంది. అన్ని సొసైటీల పరిధిలో దాదాపు 10 వేలకు పైగా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఏడాది గురుకులాల్లో తరగుతులు అప్‌గ్రేడ్ అవుతుండటంతో సిబ్బంది కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలున్నాయి. ఇందులో 2లక్షల 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర సర్కారు ప్రకటించిన 80 వేల పోస్టుల్లో, గురుకులాల్లోని ఖాళీలు కూడా ఉన్నాయి. వీటిని గురుకులాల రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సంక్షేమ శాఖల నుంచి ఖాళీల వివరాలన్నీ ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరాయి. గతంలోనే బీసీ గురుకులాల పరిధిలో 3,500 పోస్టుల కోసం ప్రతిపాదనలు పంపించారు. అవి ఏండ్ల తరబడి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ గురుకులంలో 3 వేల పోస్టులు, ఎస్టీ విభాగంగా 2 వేలు, మైనార్టీలో 1,500, జనరల్ గురుకులాల్లో 500 చొప్పున ప్రతిపాదించారు. ఇటీవల మొదటి విడతలో 30 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది. కానీ అందులో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న గురుకులాల పోస్టుల విషయం మాత్రం లేదు.
పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపితే 2022–23 విద్యాసంవత్సరం నుంచి కొత్త స్టాఫ్ అందుబాటులోకి వస్తుందని సొసైటీల అధికారులు భావించారు. కానీ ఆ దిశగా అడుగులు పడటంలేదు. గురుకులాల్లో పోస్టుల భర్తీకి గురుకులాల రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధంగా ఉంది. గతంతో ఆయా పోస్టులను ఏ వివాదం లేకుండా నింపిన అనుభవం బోర్డుకు ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే పోస్టుల భర్తీకి రెడీగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఎందుకు ఆగిందో తెలియదని అంటున్నారు. ఇప్పటికైనా గురుకుల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు.