Dharani Portal: ధరణితో దడ.. రైతులకు చుక్కలు చూపిస్తున్న ధరణి
Dharani Portal: రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Dharani Portal: రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్టు భూ సమస్యలకు పరిష్కారం దక్కకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
ధరణి పోర్టల్ లో భూముల వివరాలు నమోదు చేసేటప్పుడు తప్పులు దొర్లడం ఆన్లైన్ లో వేలాది సర్వే నంబర్లు మిస్ కావడం ఒకరి భూములు మరొకరి పేర్లపై నమోదు కావడం, పాత పట్టదారుల పేరిట కొత్త పాస్ బుక్కులు జారీ కావడం వంటి సమస్యపై సవరణల కోసం తహశీల్దార్ ల వద్దకు వెళ్తే పోర్టల్ లో సవరణలకు చాన్స్ లేదని తిప్పి పంపిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి రైతులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.
పాస్ బుక్కులలో 2,65,653 తప్పిదాలు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పింది. చనిపోయిన వారిపేర్లు ఉండడం, తప్పుగా ఆధార్ నమోదు, ఫోటోలు తప్పుగా పెట్టడం, తండ్రి పేరు, పట్టాదార్ పేరు తప్పుగా రాయడం, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వే నెంబర్ తప్పుగా రాయడం, అసైన్డ్ భూములు మార్పు చేయడం, అటవి శాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం తదితర తప్పులు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పుతుంది.
తహసిల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ సమస్యను పరిష్కరించడానికి సుముఖతగా లేరు. ప్రభుత్వ విధానాలు అమలు జరపటానికి చట్టాలు మార్చాలని సలహాలు ఇస్తున్నారు. పాసు బుక్కుల చట్టం 1971 సెక్షన్ 26 ను పూర్తిగా రద్దు చేసి సవరణ పెట్టారు. ఆ సవరణ ప్రకారం సాగు కాలం తొలగించడంతో రెవెన్యూ రికార్డులలో భూములు అమ్ముకున్నవారే తిరిగి పట్టాదారులయ్యారు. మ్యుటేషన్ జరుగకపోవడంతో కొనుగొలు చేసిన వారు హక్కులు కోల్పోయారు.
ఈ పొరపాట్లపై ప్రజలలో పెరిగిన అసంతృప్తిని గమనించి ఇంత కాలం తర్వాత ధరణీ పోర్టల్ పై సలహాలు ఇవ్వడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప సంఘాన్ని వేశారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబిత ఇంద్రరెడ్డితో వేయబడిన ఈ కమిటీ సమస్యకు పరిష్కరం చూపుతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
ధరణిలో సమస్యలు తొలగించాలని ఎప్పటి నుండో డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరణీ పోర్టల్‌లో చేయాల్సిన సవరణలు చాలా ఉన్నాయి. సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేసి సర్వే చేపట్టాలి. రెగ్యులరైజ్ చేయాలంటే గుర్తింపు కార్డు, బ్యాంకు అకౌంట్, భూమి వివరాలు, సాదా బైనామా వివరాలు, ఆధార్ కార్డు, భూమి విక్రయం, కొనుగోలు చేసేవారి పాసు పుస్తకాలు, మీ సేవా అక్నాలేడ్జిమెంట్ ఉండాలి. మీ సేవ కేంద్రాలు అనేక చిక్కులు కల్పిస్తు రిజిస్టర్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, కలెక్టర్ స్థాయి వరకు తమ బాధ్యత లేదంటూ తప్పుకుంటున్నారు. సర్వే చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి.
అవినీతి అధికారులు మరొ రూపంలో పట్టాదారులను, సాగుదారులను అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారు. వేల కేసులు సివిల్ కోర్టుల నుండి హై కోర్టుల వరకు పెండింగ్ లో కొనసాగుతున్నాయి. భూమితో సమానమైన విలువ వ్యయం చేసిన భూముల తగాదాలు మాత్రం పరిష్కారం కావడంలేదు. దేవాలయ భూములు, వక్స్ భూములు, భూదాన భూముల అక్రమణలు పెద్దఎత్తున సాగాయి. ధరణీలో ఈ దురాక్రమణలకు సంబంధించి ఎలాంటి చట్ట సవరణ లేదు. కొత్త రెవెన్యూ చట్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుందని గతంలోనే చెప్పినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.
ధరణి పోర్టల్ వల్ల చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. హనుమకొండ జిల్లా పీచర గ్రామానికి చెందిన గొల్లన్న బుజ్జయ్య ఇటీవల మరణించగా, ఆయన కుమారుడు నాగరాజు రైతు బీమా కోసం వ్యవసాయ శాఖ అధికారులను దరఖాస్తు చేసుకున్నారు. ఐతే, బుజ్జయ్య మూడు ఎకరాల భూమిలో కొంత భూమిని ఆయన కుటుంబానికి తెలియకుండానే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి పట్టా చేశారని దాంతో తన తండ్రికి సంబందించిన రైతు బీమా రెన్యూవల్ కాక పాలసీ వర్తించలేదు.
ప్రభుత్వం వేసిన కమిటీ ఈ సమస్యలన్నింటిని చర్చించి పరిష్కారం చూపాలి. అందుకు అవసరమైన రెవెన్యూ చట్టాలను సవరించాలి. కాలయాపన చేయకుండా రెవెన్యూ భూముల సమస్యలను పరిష్కరించి, భూ యాజమానులలో ఉన్న అందోళలను తొలంగించాలి. రెవెన్యూ రికార్డులలో సాగుదారు కాలం పెట్టాలి. దీని వల్ల కౌలు దారులకు రక్షణ కలుగుతుంది. భూ యజమాని భూమి అమ్ముకోవడంలో కానీ, అభివృద్ధి చేసుకోవడంలో కానీ గత కాలంలో ఎలాంటి అటంకాలు రాలేదు. ఏదేమైనా ధరణీ అమలులో వస్తున్న ఇబ్బందులను తొలగించే విధంగా కమిటీ దోహద పడుతుందని ఆశిద్దాం.