Warangal: న్యాయం చేశారు సార్.. సీపీ చిత్రపటానికి రైతు దంపతులు పాలాభిషేకం..!
Warangal: వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి రైతు దంపతులు పాలాభిషేకం చేశారు.
Warangal: వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి రైతు దంపతులు పాలాభిషేకం చేశారు. తమ పొలం అమ్మాలని బెదిరించిన వాళ్లపై కేసులు నమోదు చేసి న్యాయం చేశారని ఇలా ధన్యవాదాలు తెలుపుకున్నారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రైతు వీరాస్వామి, రాజ్యలక్ష్మి దంపతులకు నర్సంపేట శివారులో రెండు ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 20 గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్‌కు 2018లో విక్రయించినట్లు వారు తెలిపారు. నాటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటున్నారు.
అయితే, కొంత కాలంగా మరో 10 గుంటల భూమి తమకు అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడికి గురిచేస్తున్నారని ఈ రైతు దంపతులు తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరికొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆవేదన చెందారు.
కాగా.. ఇటీవల భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్న వరంగల్ సీపీ రంగనాథ్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు వీరస్వామి దంపతులు. కబ్జాదారులనుంచి తమ భూమిని కాపాడమని వేడుకున్నారు. రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రంగనాథ్ 11 మంది భూ కబ్జాదారులను అదుపులోకి తీసుకొన్నారు. సీపీ రంగనాథ్ చొరవతో తమ భూమి తమకు దక్కిందని ఆనందం వ్యక్తం చేసిన ఆ రైతు దంపతులు సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.