TSPSC: TSPSC ప్రశ్నాపత్రాల లీకేజి కేసుపై ఈడీ ఆరా
TSPSC: 250 పేజీలతో SIT నివేదిక హైకోర్టుకు సమర్పణ
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీకేజీపై దర్యాప్తుచేస్తున్న సిట్ అధికారులు, విచారణ నివేదికను సిద్ధం చేశారు. లీకేజీ ఆరోపణలపై 17 మంది నిందితులను విచారించిన సిట్ అధికారులు, 250 పేజీల సిద్ధం చేసిన నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి కోర్టుకు అందించారు. పేపర్ లీకేజీలో 40 లక్షల నగదు బదిలీ జరిగినట్టు సిట్ పేర్కొంది.
TSPSC కాన్ఫిడెన్సియల్ రూమ్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మిని సాక్షిగా సిట్ పరిగణించింది. టీఎస్పీఎస్సీ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్, రాజశేఖర్‌లదేనని పేర్కొంది. టీఎస్పీఎస్సీ మెంబర్ లింగా రెడ్డి, చైర్మెన్ జనార్ధన్ రెడ్డి లను విచారించామని తెలిపింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని.. సీబీఐ, సిట్టింగ్ జడ్జ్‌తో దర్యాప్తు చేయించాలని పిటిషన్లపై రిపోర్ట్‌లో వివరణ కోరింది. గతంలో ఎన్నో సెన్సేషనల్ కేసుల్ని విచారించామని, టీఎస్పీఎస్సీలో కూడా పటిష్ట దర్యాప్తు చేస్తున్నామని సిట్ పేర్కొంది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని రిపోర్ట్‌లో సిట్ పేర్కోంది.
మరో వైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో డాక్యుమెంట్లను అందించాలని సిట్ కు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈడీ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిట్ అధికారులకు లేఖ రాశారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించేందుకు అవకాశం కల్పించాలని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనల మేరకు ఇద్దరిని విచారించే అధికారం తమకు ఉందని ఈడీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, పబ్లిక్ డొమైన్ లో సమాచారం , ఇతరత్రా అంశాల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.
మరో వైపు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ శంకరలక్ష్మిని, సత్యనారాయణ అనే ఉద్యోగిని ఈడీ అధికారులువిచారించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టుకు సిట్ అధికారులు స్టేటస్ రిపోర్టును అందించారు. ఈడీ రంగంలోకి దిగడంతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, మెంబర్ సెక్రటరీ, పాలకమండలి సభ్యులను వేర్వేరుగా విచారించబోతున్నారు.