TRS MLA Solipeta Ramalinga Reddy Passes Away: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత
TRS MLA Solipeta Ramalinga Reddy Passes Away: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిశారు. సోలిపేట రామలింగారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.
దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి అనంతరం 2014, .2019 ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు రామ లింగారెడ్డి వివిధ వార్త పత్రిక లో ఉమ్మడి మెదక్ జిల్లా, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పని చేశారు. జర్నలిస్ట్ నాయకుడిగా రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. రామలింగారెడ్డికి భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపట్ల టీఆర్‌ఎస్ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.