దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సుజాత ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపి ఆయన ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ సమయంలో ఆమె వెంట మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సుజాతకు పార్టీ బి-ఫారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడాలని జరగబోయే ఉపఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పారు.
ఇక పోతే జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే దుబ్బాక అభ్యర్థిగా సుజాతను ఎంపిక చేసినట్లు గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం బీ ఫారం అందుకున్న సుజాత మాట్లాడుతూ సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని కోరారు. మీ ఆశీస్సులతో ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, రాజమౌళి పంతులు ఉన్నారు.