కడుపు నొప్పని ఆసుపత్రికి వెళితే..బయట పడ్డ డాక్టర్ల నిర్వాకం!
కడుపు నొప్పికి వైద్యం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో కత్తెరలు, దూది, వాచ్ లు పెట్టి కుట్లు వేసే సీన్ లను మనం కొన్ని సినిమాల్లో చూసేం ఉంటాం.
కడుపు నొప్పికి వైద్యం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో కత్తెరలు, దూది, వాచ్ లు పెట్టి కుట్లు వేసే సీన్ లను మనం కొన్ని సినిమాల్లో చూసేం ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే నిజంగా కూడా జరిగింది. తీవ్రంగా కడుపు నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేసి కణితులు తొలగించాల్సింది వైద్యులు ఏకంగా కడుపులో క్లాత్, కాటన్ కుక్కేసి సర్జరీ పూర్తి చేసారు. దీంతో పాపం ఆ మహిళ మళ్లీ కొన్ని రోజులకు అదే కడుపునొప్పిలో ఆస్పత్రిలో చేరింది మళ్లీ ఆమెకు సర్జరీ చేయగా అప్పుడు అసలు విషయం బయటపడింది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన లాలమ్మ(43) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. అయినా ఫలితం లేకపోవడంతో గతేడాది ఫిబ్రవరిలో ఆమెను ఆమనగల్లులోని ఓ ఆసుపత్రిలో చూపించారు. కాగా అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి కడుపులో కణితులు ఉన్నాయని నిర్ధారించారు. వెంటనే ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెబుతూ బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కాగా అక్కడి వైద్యులు లాలమ్మకు ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. అప్పటి నుంచి బాగానే ఉన్నలాలమ్మకు ఈ మధ్య కాలంలో మళ్లీ కడుపునొప్పి రావడం మొదలయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని తెలిపారు.
వైద్యులు చెప్పిన దానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో ఆమె కడుపులో నుంచి కణతులతో పాటు క్లాత్, ఆపరేషన్‌లో వినియోగించే పత్తి ఉండలు బైటపడ్డాయి. దీంతో వైద్యులు వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసారు. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. అది విన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే పాత ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను నిలదీద్దామనుకున్నారు. కానీ అక్కడ ఆస్పత్రి మూసివేశారు. దీనిపై బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.