Devineni Avinash: విమానం ఎక్కకుండా దేవినేని అవినాష్‌ని అడ్డుకున్న అధికారులు

దేవినేని అవినాష్‌కి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి దుబాయ్ వెళ్లేందుకని గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన దేవినేని అవినాష్‌ని ఎయిర్‌పోర్ట్ అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు.

Update: 2024-08-16 07:42 GMT

Devineni Avinash stopped from boarding Dubai flight: హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్‌కి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి దుబాయ్ వెళ్లేందుకని గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన దేవినేని అవినాష్‌ని ఎయిర్‌పోర్ట్ అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. దేవినేని అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన విషయాన్ని ఏపీలోని మంగళగిరి పోలీసులకు తెలిపారు.

దేవినేని అవినాష్ విదేశీ ప్రయాణం గురించి శంషాబాద్ విమానాశ్రయం సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు.. ఆయనపై కేసులు నమోదై ఉన్నందున దేశం దాటి వెళ్లకుండా అడ్డుకోవాల్సిందిగా కోరారు. ఎయిర్‌పోర్ట్ అధికారులకు దేవినేని అవినాష్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. అయినప్పటికీ వారు ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో దేవినేని అవినాష్ ఎయిర్ పోర్టు నుండి ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

దేవినేని అవినాష్‌ని అడ్డుకోవడానికి కారణం ఏంటంటే..

2021 అక్టోబర్ నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ సెంట్రల్ ఆఫీసుపై పలువురు దాడికి పాల్పడిన ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు దేవినేని అవినాష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేవినేని అవినాష్ నిందితులను ఈ దాడికి పాల్పడేలా ఉసిగొల్పినట్టు తమవద్ద తగిన ఆధారాలు ఉన్నాయి అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ ఘటన విచారణ జరిపించాల్సిందిగా మరోసారి టీడీపీ పోలీసులను ఆశ్రయించింది. గత ప్రభుత్వం తమ ఫిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి కేసును పక్కకుపెట్టింది అని టీడీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటన జరిగిన రెండేళ్ల తరువాత తెలుగు దేశం పార్టీ ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు ఈ కేసులో విచారణ వేగవంతం చేసి ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిపై లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ పేరు కూడా లుకౌట్ నోటీసుల జాబితాలో ఉండటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఆయన దేశం దాటి దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసుల్లో పేరున్న వారిని దేశం దాటి వెళ్లకుండా చూసి ఆ సమాచారాన్ని సంబంధిత పోలీసులకు చేరవేయడం ఎయిర్ పోర్ట్ అధికారుల బాధ్యత. దేవినేని అవినాష్ విషయంలో కూడా అదే జరిగింది. సాధారణంగా ఇలాంటి సీన్స్ సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి జరిగినప్పుడు అవి ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి అనే విషయం తెలిసిందే. 

Tags:    

Similar News