Dengue Alert in Telangana: తెలంగాణలో డెంగ్యూ విజృంభణ.. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి పాజిటివ్..

డెంగ్యూ బాధిత చిన్నారులతో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నిలోఫర్‌లో 12 యూనిట్లు ఉండగా.. ప్రతి యూనిట్‌లో 10 నుంచి 12 మంది చికిత్స పొందుతున్నారు.

Update: 2024-08-27 03:54 GMT

Dengue Alert in Telangana: తెలంగాణలో డెంగ్యూ విజృంభణ.. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి పాజిటివ్..

Dengue Alert in Telangana : తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,372 మంది దీని బారిన పడ్డారు. జూన్‌ నెలాఖరు వరకు 1,078 మందికి నిర్ధారణవగా, గత రెండు నెలలుగా 4,294 నమోదయ్యాయి. డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు డెంగ్యూకేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది 8,016 డెంగీ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది భారీగా కేసులు నమోదైనా డెంగ్యూ మరణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో చికున్‌ గున్యా కేసులూ పెరుగుతున్నాయి. చికున్‌ గున్యా ఉందన్న అనుమానంతో 2,673 నమూనాలను పరీక్షించగా 152 కేసులు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి 5శాతం పాజిటివిటీ ఉంటోంది. ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బయటపడుతున్నాయి. గత ఏడాది అధికారికంగా 43 గున్యా కేసులు నమోదయ్యాయి.

డెంగ్యూ బాధిత చిన్నారులతో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నిలోఫర్‌లో 12 యూనిట్లు ఉండగా.. ప్రతి యూనిట్‌లో 10 నుంచి 12 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారులను ఐసీయూలో ఉంచారు. ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆసుపత్రుల్లోనూ అదే స్థాయిలో రోగులు జ్వరాలతో వస్తున్నారు. బాధితుల్లో ఏడాదిన్నర నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు.

పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందన్నారు. డెంగ్యూకి కారణమయ్యే టైగర్‌ దోమ మంచి నీటిలో పెరిగి.. ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Tags:    

Similar News