రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా తాము పోలీస్ అధికారులమంటూ మెస్సేజ్ ల ద్వారా భారీగా డబ్బు గుంజేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. ఈ మొత్తం వ్యవహారంలో సైబర్ నేరగాళ్ల చర్యలకు పోలీసులే తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఈ చీటర్స్ వ్యవహారం ఎక్కడ నుండి నడుస్తుంది..? ఏకంగా పోలీసులనే ఎందుకు టార్గెట్ చేశారు.
సైబర్ క్రైమ్స్.. ఈ నేరాలు ప్రస్తుత కాలంలో సర్వ సాధారణమైపోయాయి. అయితే నేరాలను అరికట్టే పోలీసులనే నేరగాళ్లు టార్గెట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో గుర్తింపు ఉన్న అధికారుల పేరుమీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఫోట్ , బయోడేటాతో సహా అంతా కరెక్ట్ గా పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత మ్చూచువల్ ఫ్రెండ్స్ ఎవ్వరున్నారో గుర్తించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు నెమ్మదిగా తనే పోలీస్ అధికారి అనే రేంజ్ లో కలరింగ్ ఇస్తూ చాట్ చేయడం ప్రారంభిస్తారు. ఇక అవతల వ్యక్తి నిజంగానే అధికారి తనతో చాట్ చేస్తున్నాడని భావించే విధంగా నటిస్తారు ఈ సైబర్ నేరగాళ్లు. అవతలి వ్యక్తులు అమాయకులైతే ఇక వాళ్ల జేబుకు చిల్లులు పడినట్టే.
ఛాటింగ్ ద్వారా స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే తనకు అర్జెంట్ గా డబ్బులు అవసరమున్నాయని, త్వరగా పంపాలని బెదిరింపులకు దిగుతారు. అవి పంపడానికి ఓ గూగుల్ పే నెంబర్ కూడా పంపిస్తారు దీంతో సదరు వ్యక్తి భయంతో ఎందుకన్నా మంచిదని ఒక్క ఫోన్ కాల్ చేస్తేమాత్రం ఆ నంబర్ స్విచ్చాఫ్ ఇలా సైబర్ నేరగాళ్లు పోలీస్ ఉన్నతాధికారుల ఫేక్ అకౌంట్స్ ద్వారా సొమ్ము చేసుకునే ప్లాన్ చేశారు.
ఇప్పటికే నల్లగొండ ఎస్పీ రంగనాధ్ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు ఈ కేటుగాళ్లు. అర్జెంట్ గా తన భార్య నెంబర్ కు 20 వేల రూపాయలు పంపమని మెసేజ్ రావడంతో భాధితుడు రిటర్న్ లో ఫోన్ కలవడం లేదని మెసేజ్ చేసిన విషయం ఆ స్క్రీన్ షాట్ లు సైతం వైరలయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసాయి. దాదాపు 50 మంది పోలీసు అధికారుల ఫేక్ అకౌంట్స్ ద్వారా సౌబర్ నేరాలకు తెర లేపారు కేటుగాళ్లు. ఇక రోజురోజుకు ఈ వ్యవహారం సృతి మించుతుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీని సీరియస్ గా తీసుకున్నారు. అంతర్గతంగా హ్యాకర్ల జాడ కోసం కోసం వేట కూడా ప్రారంభించినట్లు సమాచారం.
ఇక సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు మరోసారి ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఏకంగా పోలీసులనే టార్గెట్ గా ఈ వ్యవహారం సాగుతున్న నేపధ్యంలో ఉన్నతాధికారులు ఎవ్వరూ ఈ విషయం పై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. ఏదేమైనా కిలాడీ నేరగాళ్ల వలలో అమాయకులు పడ్డొదని సూచిస్తున్నారు. పోలీసు అధికారుల పేర్లతో ఎవ్వరు డబ్బులు అడిగినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు.