Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
Hyderabad: సైబర్ క్రైమ్ ఠాణాలకు బాధితుల క్యూ
Hyderabad: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో రోజుకు పదికిపైగా కేసులు నమోదు అవుతున్నాయి. మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ రాణాలకు క్యూ కడుతున్నారు. మాట్రిమోని మోసాలు, పెట్టుబడులు పేరిట, ఇతర వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్ల లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు
పెళ్లి పేరుతో బోయిన్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. భారత్ మ్యాట్రిమొని సైట్లో యువతి వివరాలు నమోదు చేసుకుంది. అది చూసిన సైబర్ నేరగాడు ఆమెకు పరిచయం అయ్యాడు. లండన్‌లో మంచి ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. ఇండియాకు వస్తున్నానని ఫోన్ చేశాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. మరోవ్యక్తితో కస్టమ్స్ అధికారిగా మాట్లాడించాడు. వివిధ చార్జీలు 10లక్షలు కట్టాలని చెప్పగా... అతను తెలిపిన ఖాతాకు యువతి బదిలీ చేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటు మెహిదీపట్నంకి చెందిన అన్సార్ అహ్మద్‌ను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఇల్లు అద్దెకిస్తామని మ్యాజిక్ బ్రిక్స్ యాప్‌లో అన్సార్ పోస్టు పెట్టాడు. అద్దెకు తీసుకుంటామని సైబర్ నేరగాళ్లు స్పందించారు. మొదట గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేస్తామని చెప్పారు. అతని వాట్సాప్‌కు లింక్ పంపించారు సైబర్ నేరగాళ్లు. లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని అన్సార్ వివరాలు నమోదు చేశాడు. దీంతో వెంటనే ఖాతాలోని లక్ష 70వేలు మాయం అయ్యాయి.
పేటీఎం కేవైసీ అప్‌డేట్ పేరుతో తార్నాకకు చెందిన చంద్రశేఖర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. చంద్రశేఖర్ తన స్నేహితుడికి పేటీఎం ద్వారా నగదు బదిలీ చేయగా... అతని ఖాతాలో జమ కాలేదు. గూగుల్‌లో వెతికి పేటీఎం నకిలీ కస్టమర్ కేర్‌ను చంద్రశేఖర్ సంప్రదించాడు. పేటీఎం అప్‌డేట్ చేసుకోవాలని నెంబర్ కు సందేశం రాగా ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపించారు. లింక్ ను క్లిక్ చేసి తన ఖాతా వివరాలు నమోదు చేసిన వెంటనే అతని ఖాతా నుంచి లక్ష 50వేలు మాయం అయ్యాయి. మరో కేసులో పెట్టుబడుల పేరుతో మల్లేపల్లికి చెందిన ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
రుణ వేధింపులు తట్టుకోలేక నగరానికి చెందిన ఫైజల్ బీన్ యాకూబ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రుణ యాప్ ద్వారా పదివేలు తీసుకున్నానని మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. అయినా తన వాట్సాప్ లో ఉన్న స్నేహితుల ఫోన్ నెంబర్లకు తనను కించ పరుస్తూ సందేశాలు పంపిస్తున్నారని ఫిర్యాదు చేశాడు.