Cyber Crime: పసివాడి ప్రాణంతో సైబర్ నేరగాళ్ల చెలగాటం
Cyber Crime: రోగులను సైతం వదలని కేటుగాళ్లు
Cyber Crime: పసివాడి ప్రాణంతో సైబర్ నేరగాళ్లు చెలగాటమాడారు. వ్యాధితో బాధపడుతున్నా కేటుగాళ్లు వదలలేదు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న అమాయక తల్లిదండ్రులను ఆసరాగా చేసుకొని మోసానికి పాల్పడ్డారు. ఆదుకుంటామని చెప్పి అకౌంట్లోని డబ్బులు ఊడ్చేయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన సైబర్ నేరగాళ్లు పల్లె వాసులను కూడా వదలడం లేదనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన మేఘనాథ్ అనే నాలుగు నెలల బాబు లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. పసివాడి ప్రాణాలను కాపాడుకునే తాపత్రయంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రులకు తీసుకువెళ్ళారు. వైద్యులు అన్నిరకాల పరీక్షలు చేసి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని తెలిపారు. ఇందుకుగాను 18 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేక స్వగ్రామం అనిశెట్టి పల్లికి తిరిగి వెళ్లిపోయింది బాధిత కుటుంబం.
బాబు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం బంధువులు, దాతల సాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీన్ని అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెంబర్‌కు ఫోన్ చేశారు. తాము సోనూ సూద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. బాధితుల అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పి వారి ఫోన్ కు యాప్ లింక్ ను పంపించారు. యాప్ డౌన్ లోడ్ చేసి అందులో వివరాలు నమోదు చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన బాధిత కుటుంబం అకౌంట్ నెంబర్లు, ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసి ఓటిపి చెప్పారు. ఇంకేముంది, ఆ అకౌంట్ లో ఉన్న 14 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. కంగుతిన్న బాధిత కుటుంబం స్థానిక లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమలా ఎవరూ మోసపోవద్దని, దయచేసి ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితులు సూచిస్తున్నారు. ఓటీపీలు, ఏటీఎం కార్డు నెంబర్లు ఎవరికీ షేర్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని తెలిపారు. తమ పిల్లాడి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నారు. ఓటీపీ, కేవైసీ అప్డేట్, బ్యాంకు అధికారులమని నమ్మబలికే వారి మాటలతో మోసపోతున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ పడాలంటే ప్రజల అప్రమత్తతే అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.