Agneepath Scheme Protests: సికింద్రాబాద్ ఘటనలో నిఘా వర్గాలపై విమర్శలు
Agneepath Scheme Protests: మెసేజ్‌లను గుర్తించడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అనే విమర్శలు
Agneepath Scheme Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం ఘటనలో నిఘా వర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడ్రోజులుగా దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై అల్లర్లు రాజుకున్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ వేదికగా సమాచారం చేరవేసుకుంటూ.. ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరి ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.
కేంద్రం అగ్నిపథ్‌ను ప్రకటించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా ఆర్మీ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుున్న ఉద్యోగార్థులు.. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ గళమెత్తారు. ఈ పథకంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రైల్వేస్టేషన్ల వద్ద నిరసనలు, విధ్వంసాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనైనా రాష్ట్ర పరిస్థితులను నిఘావర్గాలు గుర్తించాలి. రైల్వేస్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసేలా అలర్ట్ చేయాలి.. కానీ అలా చేయలేదు. ఉద్యోగార్థులు ఆందోళన చేయనున్నారనే విషయం పసిగట్టలేకపోయింది.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ వద్ద నిరసన చేపట్టాలనే సందేశం.. ఆర్మీ ఉద్యోగార్థుల వాట్సాప్ గ్రూపుల ద్వారానే సర్క్యులేట్ అయింది. 8 వాట్సాప్ గ్రూపుల్లో మొదలైన ఈ సందేశం.. అలా అలా వేలమందికి చేరువైంది. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ కళ్లలో ఈ సందేశం పడలేదు. ఈ మెసేజ్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఆందోళనకారులు.. గురువారమే హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. పరీక్ష రాయడానికి వచ్చామని చెబుతూ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాంతాలతో పాటు.. లాడ్జీల్లో బస చేసినట్టు సమాచారం. దీనిని గుర్తించడంలోనూ రాష్ట్ర, నగర నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.