పసికందుతో పొలిమేరల్లోనే పచ్చి బాలింత..కనికరం చూపని గ్రామస్థులు

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం అవుతున్నారు.

Update: 2020-05-21 06:26 GMT
Representational Image

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం అవుతున్నారు. బతుకుదెరువు కోసం ఇతర పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి తమ తమ గ్రామాలకు వస్తున్న వారిని 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతున్నారు. మరి కొంత మందిని హోం క్వారంటైన్లో ఉంచుతున్నారు. కరోనా లక్షణాలు ఎవరిలోనైన కనిపిస్తే వెంటనే వారికి వైద్య పరీక్షలు చేసి ఆస్పత్రులకు పంపిస్తున్నారు. క్వారంటైన్ లో ఉన్న వారు గడప దాటి బయటకు రావొద్దని, ఎవరినీ కలవొద్దని సూచిస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో బయటి నుంచి వచ్చిన వ్యక్తులను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకుని, ఊరి బయటే ఉంచుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ గిరిజన బాలింతను కూడా గ్రామస్థులు గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ బాలింత దిక్కుతోచని పరిస్థితిలో బిక్కు బిక్కు మంటూ ఆ పసిగుడ్డును పట్టుకుని ఆరు రోజులపాటు ఊరి బయట ఉన్న ఓ చెట్టు నీడలోనే గడిపింది. కనీసం చిన్నారిని చూసి కూడా గ్రామస్థులు జాలిచూపలేదు. గుండెలను పిండేసే ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులగూడలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బొప్పరికుంట పంచాయతీలోని రాజులగూడకు చెందినన జైతు, అనసూయ దంపతులు బతుకుదెరువు కోసం కరీంనగర్ వలస వెళ్లారు. కాగా అనసూయ మే 14వ తేదీన కరీంనగర్ లోనే ఓ పాపకు జన్మనిచ్చింది.

పచ్చిబాలింతను, చిన్నారిని చూసుకునే వారు లేకపోవడంతో వారు మరుసటి రోజు వారు తమ సొంత గ్రామానికి చేరుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మొదట మొదలైంది కరీంనగర్ లోనే కావడంతో గ్రామస్థులు అనసూయ దంపతులను, ఆ చిన్నారిని గ్రామంలోకి రానీయలేదు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో వారు ఊరి చివరన ఓ చెట్టు కింద గుడారం వేసుకొని నివసిస్తున్నారు.

ఈ విషయం గురించిన సమాచారం తెలిసిన వైద్య సిబ్బంది, అధికారులు బుధవారం రాజులగూడకు చేరుకున్నారు. తల్లీబిడ్డకు వైద్యపరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. ఆ తరువాత గ్రామస్థులతో మాట్లాడిన అధికారులు వారిని ఒప్పించి ఇంట్లోనే క్వారంటైన్లో ఉండే ఏర్పాట్లు చేశారు. అనసూయ, జైతు దంపతులకు క్వారంటైన్ ముద్ర వేసి ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. కరోనా కారనంగా ఇదే విధంగా ఎంతో మంది వలస కూలీలు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News