బల్దియాలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను వెంటాడుతున్న కష్టాలు

Frontline Warriors: వారి సేవకు గుర్తింపు లేదు.. త్యాగానికి గౌరవం లేదు. పనికి విలువ లేదు.

Update: 2021-05-27 10:48 GMT

పారిశుద్ధ్య కార్మికులు (పాత చిత్రం)


 

Frontline Warriors: వారి సేవకు గుర్తింపు లేదు.. త్యాగానికి గౌరవం లేదు. పనికి విలువ లేదు.. అయినా అన్నింటినీ ఓర్చుకుంటారు. అమ్మలా ఊరిని శుభ్రపరుస్తారు. వైద్యుడిలా నగర ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు. వారే రాత్రి వేళల్లో పనిచేసి.. తమ శ్రమను చీకట్లో దాచి ఛీత్కారాలను ఎదుర్కొనే పారిశుద్ధ్య కార్మికులు. కష్టపడి తమ కాళ్లపై తామే నిలబడుతున్నారు. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి దయనీయంగా మారింది

కోటి జనాభా నివసించే నగరాన్ని ప్రతి రోజు శుభ్రం చేయడమంటే మామూలు విషయం కాదు. ఉదయం నగర రోడ్లు చూడగానే అద్దంలా మెరుస్తాయి. వెనుక పారిశుద్ధ్య కార్మికులు కృషి దాగుంది. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి దయనీయంగా మారింది. బల్దియాలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో దాదాపు 23 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉండి నగరాన్ని శుభ్రం చేస్తున్న కార్మికులు.. అడపాదడపా కోవిడ్ బారిన పడుతున్నారు. రోడ్లు ఊడ్చడం.. అక్కడ ఉండే చెత్తను ఎత్తడం వంటి సందర్భాలతో కోవిడ్ బారిన పడుతున్నారు.

కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు అందించాల్సిన బాధ్యతపై బల్దియాపై ఉంది. ఇలాంటి సమయంలో తమకు అండగా ఉండాల్సిన యంత్రాంగం ముఖం చాటేసిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విధుల్లో వైరస్‌ బారిన పడిన కార్మికులు.. ఐసోలేషన్‌ లేదా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైమ్‌లో 14 రోజులు లేదా 20 రోజుల వరకు వేతనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉపన్యాసాలకు, ప్రసంశలకు పరిమితం చేయకుండా.తల్లిలా నగర ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News