Telangana: స్కిల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది... ఇందులోని కోర్సులేంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Courses at Young India Skill University: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఆడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Young India Skill University: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఆడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 29 లోపుగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ కోరింది. ఈ ఏడాది నవంబర్ 4 నుంచి కోర్సులను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 4 నుంచి కోర్సులను ప్రారంభం కానున్నాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
స్కిల్ యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ https://yisu.in ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లో దరఖాస్తు ఫారం ఉంటుంది. ఇందులో అభ్యర్ధి పేరు, తండ్రి పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, అడ్రస్ ఇవ్వాలి. అభ్యర్ధులు తమ విద్యార్హతలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలి. ఇంటర్మీడియట్, బీఎస్ సీ, బీఏ, ఎంఏ, బీబీఏ, ఎం కామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, డిప్లొమా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కాలేజీలో చదువుకున్నారు. ఎప్పుడు ఆయా కాలేజీల నుంచి పాస్ ఔట్ అయ్యారో వివరాలు పొందుపర్చాలి. కాలేజీలో మీ స్పెషలైజేస్, పర్సెంటేజీ, ప్రస్తుతం స్కిల్ యూనివర్శిటీలో ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో వివరాలు అందించాలి. ప్రతిఏటా విద్యార్ధులు ఆయా కోర్సులు అభ్యసించేందుకు రూ. 50 వేలు చెల్లించాలి.
స్కిల్ యూనివర్శిటీలోని కోర్సులు
ఈ యూనివర్శిటీలో మొత్తం 17 కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే ఈ ఏడాది మాత్రం లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసూటికల్స్, లైఫ్ సైన్సెన్స్ , లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్ స్కూల్ కింద వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్ కోర్సులు ప్రారంభించనున్నారు.
స్కిల్ యూనివర్శిటీ ఉద్దేశ్యం ఏంటి?
నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలతో పాటు కోర్సులను డిజైన్ చేస్తున్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్ధులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వందలాది మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. వీరందరికి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తే ఉపాధి లభిస్తుందని ఈ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యూనివర్శిటీకి ఛైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రభుత్వం నియమించింది.
57 ఎకరాల్లో స్కిల్ యూనివర్శిటీ
స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తూ 2024, ఆగస్టు 14న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. . రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 1న భూమి పూజ చేశారు. యూనివర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం 57 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ యూనివర్శిటీకి రూ.100 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. యూనివర్శిటీ స్వంత భవనం పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఈ విద్యా సంవత్సరం రాయదుర్గంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ప్రాంగణంలోని రెండు భవనాలను స్కిల్ యూనివర్శిటీకి కేటాయించారు.