ప్రత్యేక పుస్తకాలు కొనాల్సిందే.. ఇది కార్పొరేట్ స్కూళ్ల నయా దందా !

Update: 2020-09-09 04:43 GMT

కరోనా మ‌హమ్మారి దెబ్బకు వ్యవస‌్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. విద్యా రంగం మరింత కుదేలయింది. క్లాస్ రూమ్ లో ఉపాద్యాయుల ముందు కూర్చొని వినాల్సిన పాఠాలు ఇంట్లోనే మొబైల్ ద్వారా ఆన్ లైన్ రూపంలో వింటున్నారు. అయితే ఇదివరకు స్కూళ్లకు వెళ్లి చదివే విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో ఇబ్బంది పెట్టిన యాజమాన్యాలు ఇప్పుడు మరో రూపంలో టార్చర్ పెడుతున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పిల్లలు ఆన్ లైన్లో క్లాసులు వింటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్, కార్పోరెట్ విద్యాసంస్థలు సరికొత్త వ్యాపారం మొదలెట్టారు. ప్రాక్టిస్ ప్రోగ్రామ్స్ కింద ప్రత్యేక పుస్తకాలను రూపొందిస్తున్నారు. వాస్తవానికి పాఠ్య పుస్తకాల్లో ఉన్న ముఖ్యమైన అంశాలను వరుసగా చేర్చి మాడ్యూల్స్ పేరిట రూపొందిస్తున్నారు. వాటిని విద్యార్ధులు తప్పనిసరి కొనుగోలు చేయాలని షరతులు పెడుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఒకో సబ్జెక్టుకు ఒకో మాడ్యూల్ తయారు చేస్తుంటే, మరికొన్ని పాఠశాలలు లాంగ్వేజెస్ ను ఒక పుస్తకంగా, మిగతా సబ్జెక్టులను మరో పుస్తకంగా రూపొందించాయి. వీటి ధరలు రెండు వేలు నుంచి మూడు వేలు వరకు నిర్ధేశించి విద్యార్ధులకు అంటగడుతున్నారు.

ప్రస్తుతం ప్రవేటు, కార్పోరేటు స్కూళ్లు ఈ మాడ్యూల్స్‌ రూపొందిస్తున్నాయి. ఈ పుస్తకాలను పాఠశాల యాజమాన్యాలే ముద్రిస్తుండటంతో వారు అనుకున్న ధరలే అచ్చవుతున్నాయి. విద్యార్థులకు పాఠ్యాంశం అభ్యసన కార్యక్రమాలు మంచిదే అయినా, ఇంతపెద్ద మొత్తంలో ధరలు నిర్ధేశించి దండుకోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. వంద రూపాయలు కూడా వెలకట్టలేని పుస్తకాలపై వేల రూపాయలు డిమాండ్‌ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్నింటినీ వ్యాపార కోణంలో సాగిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కావలసిన పుస్తకాలు కొనడానికి ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఇలా కొత్త పుస్తకాల కొనుగోలు గుది బండగా మారిందని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. మరో వైపు ఫీజులు పే చేయకుంటే గ్రూప్ లలో నుంచి తొలగించడం ద్వారా కూడా విద్యార్దులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News