తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కలకలం..కొత్త కరోనా స్ట్రెయిన్ అని అనుమానాలు
* జిల్లాలవారీగా వెలుగుచూస్తున్న కరోనా కేసులు * పాత కరోనానా..? కొత్త స్ట్రెయిన్ ఆ..? అర్థంకాని పరిస్థితి * బ్రిటన్ నుంచి మంచిర్యాలకు వచ్చిన 8మంది * నిజామాబాద్‌లోనూ స్ట్రెయిన్ టెన్షన్ *బ్రిటన్, ఇటలీ నుంచి జిల్లాకు 24మంది రాక
తెలంగాణలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలవరం మొదలైంది. దీంతో బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. 10 రోజుల క్రితం బ్రిటన్ నుంచి మంచిర్యాల జిల్లాకు వచ్చిన 8 మందిని ట్రేస్ చేసి పట్టుకున్న అధికారులు.. వారికి RT PCR టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఏడుగురికి నెగిటివ్ రాగా.. లక్షెట్టిపేటకు చెందిన ఒకరికి మాత్రం పాజిటివ్‌గా తేలింది. అయితే.. అతడికి సోకింది కరోనానా..? లేక స్ట్రెయిన్ అనేది మాత్రం మరికొన్ని టెస్టులు చేస్తేనే కానీ చెప్పలేమని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.
బ్రిటన్ నుంచి సిద్దిపేటకు వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఐదుగురిని గుర్తించి, వారి శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించారు. ప్రస్తుతం కోవిడ్ సోకిన మహిళ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు బ్రిటన్ నుంచి జిల్లాకు వచ్చిన 9 మందిని గుర్తించి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు నిజామాబాద్‌లో స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. బ్రిటన్, ఇటలీ నుంచి జిల్లాకు 24 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వారి శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు చేయగా.. 11 మందికి నెగిటివ్ వచ్చింది. మరికొందరి టెస్ట్ రిజల్ట్స్ రానున్నాయి. అయితే.. బ్రిటన్ నుంచి వచ్చినవారు ఆరోగ్యంగానే ఉన్నారని.. వారికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.