కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే యువతతోనే సాధ్యమంటున్నాయి పరిశోధనలు. ఇందుకు వారిపై కరోనా అధిక ప్రభావం చూపుతుండటమే కారణమంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో యువతే అధికంగా ఉండటంతో కేర్ ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్ర యువతపై పంజా విసురుతోంది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే యువతే అధికంగా ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో హైదరాబాద్, సూర్యాపేటలో అత్యధికంగా కేసులు నమోదవుతుండగా ఇందులో 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉన్నవారికి కరోనా ప్రభావం ఎక్కువగా చూపిస్తోందంటున్నారు వైద్య నిపుణులు. వీరి తర్వాత 20 ఏళ్ల లోపు వారు ఉండగా మిగిలిన కేసుల్లోనూ మధ్య వయస్కులే అధికంగా ఉంటున్నారు. దాంతో వైద్య నిపుణులు యువత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఈనెల 19 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే ఒక్క హైదరాబాద్ లోనే 395 మంది కరోనా బాధితులున్నారు. ఇందులో 53 పదేళ్ల లోపు చిన్నారుల కేసులు కాగా మరో 53 కేసులు 10 నుంచి 20 ఏళ్ల మధ్య వారివి ఉన్నాయి. 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న 76 మందికి కరోనా సోకింది. దీంతో 30 ఏళ్ల లోపు యువత కరోనాని తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. అటు ఏపీలోనూ యువతపైనే అధిక ప్రభావం చూపుతోంది కరోనా. దేశవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు, గణాంకాల ప్రకారం దాదాపు 60 శాతం మంది బాధితులు 20 నుంచి యాభై ఏళ్ల లోపు వారే ఉన్నారు.
యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో తమకేం కాదనే ధోరణి వారిలో కనిపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. యువతలో ఉన్న ఈ నిర్లక్ష‌్యమే కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. వారిలో లక్షణాలు పెద్దగా కనిపించకపోవటం చిక్కులు తెచ్చిపెడుతోందని చెబుతున్నారు. ఇప్పటికే భారత వైద్య పరిశోధన మండలి కూడా 80 శాతం మందికి లక్షణాలు కనిపించలేదని తెలిపింది. దాంతో తమకేం అవుతుందిలే అనుకునే యువత ఇప్పటికైనా నిర్లక్ష‌్యం వీడాలని ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.