Coronavirus Effect on Kuntala Waterfall : పచ్చని అడవిలో తెల్లని అకాశగంగా పరవళ్లు తొక్కుతోంది. కొండలకొనల నుంచి జలనిధి ఎగిసిపడుతోంది. ఆ జలపాతం సప్తస్వరాలను వినిపించే సంగీత సాధనంలా కనిపిస్తోంది. అందాలను ప్రదర్శించే వేదికను తలపిస్తుంది. కదిలే అందాల అలలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. కనివిందు చేస్తాయి. ఈ ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న కుంటాల జలపాతంపై హెచ్ ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
జల మందారాలను అల్లినట్లు సంగీతాన్ని పలకరించినట్లు కనిపించే అద్భుత దృశ్యమాలిక ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం. చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ఆ కొండల నుంచి ఎగిసిపడే తరంగమై విహరించే విహంగమై కన్నెపిల్లల కదులుతూ వస్తుంది ఆ జలపాతం.
వానకాలం వచ్చిందంటే చాలు కుంటాల జలపాతం పరుగులు పెడుతుంది. కొండల నడుమ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ అందాల వీక్షణకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పర్యాటకులు వందలాదిగా తరలివస్తుంటారు. దీంతో అక్కడున్న చిరు వ్యాపారులకు జీవనోపాధి కలిగేది. కానీ ఇప్పుడు కరోనా రక్కసి జలపాతంపై విషం చిమ్ముతోంది. పర్యాటకులు రాకుండా అధికారులు ఆంక్షాలు విధించారు. దీంతో జలపాతం అందాలు అడవికాసిన వెన్నెలను తలపిస్తున్నాయి.
పర్యాటకులు సందడి లేక జలపాతం సమీప ప్రాంతాలు నిర్మానుశ్యంగా మారాయి. చిరువ్యాపారులు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నారు. అలాగే కరోనా ప్రభావం తాత్కాలిక ఉద్యోగులపై కూడా పడింది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.