Hyderabad: రిస్క్ టేకర్స్‌కు వ్యాక్సినేషన్..తొలిరోజు 30వేలమందికి
Hyderabad: తెలంగాణలో సూపర్ వ్యాక్సినేషన్ షురూ అయింది.
Hyderabad: తెలంగాణలో సూపర్ వ్యాక్సినేషన్ షురూ అయింది. ఇవాల్టి నుంచి 10 రోజులపాటు పబ్లిక్ సర్వీసెస్‌లో హైరిస్క్‌లో ఉన్న వారికి వ్యాక్సిన్ కొనసాగనుంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పౌరసరఫరాల శాఖ సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, వివిధ దుకాణాల్లో పనిచేసే వారికి సూపర్ స్ప్రెడర్ల కేటగిరీలో వ్యాక్సిన్ వేస్తున్నారు.
కరోనా కట్టడిలో భాగంగా నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్నవారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం... వారందరికీ టీకాలు వేయాలని నిర్ణయించింది. వారికోసం ఇవాళ్టి నుంచి 10 రోజులపాటు ప్రత్యేకంగా టీకా పంపిణీ చేపట్టింది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్‌లోని రిస్క్ టేకర్స్‌కు టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 10 రోజుల పాటు జరగనున్న ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సిటీలోని ఒక్కో సర్కిల్ నుంచి రోజుకు వెయ్యి మందికి టీకాలు అందిస్తున్నారు
మరోవైపు.. పౌర సరఫరాల విభాగంకింద 85వేల 31 మందికి, జర్నలిస్టులు 20వేల మంది, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్‌డ్రైవర్లు 3 లక్షల మంది, రైతుబజార్లలోని వ్యాపారులు, పూలు, పండ్ల దుకాణదారులు, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, కిరాణ దుకాణదారులు, మాంసం వ్యాపారులుసహా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 3 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ టీకా పంపిణీ చేసే బాధ్యతను సంబంధిత శాఖలకు అప్పగించారు.
ఇక.. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో తొలిరోజు.. దాదాపు 30వేల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 32 సెంటర్లు ఏర్పాటు చేసి సూపర్ స్ర్పెడర్లకు వ్యాక్సిన్ అందిచారు. మరోవైపు.. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర వైరస్ వ్యాప్తి చెందే రిస్క్ లేకుండా బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. టైమ్ స్లాట్ టోకెన్ల ఇవ్వడంతో పాటు ఎక్కువ కౌంటర్ల పెట్టడం ద్వారా వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం ప్రతి సెంటర్ దగ్గర హెల్త్ స్టాఫ్‌కు సపోర్టింగ్‌గా 25 మంది చొప్పున బల్దియా సిబ్బందిని నియమించారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు