Mohammad Azharuddin is staying away from active politics : గులాబీతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే గ్రౌండ్‌లో సైలెంటన్న ఆరోపణల్లో నిజమెంత?
Mohammad Azharuddin is staying away from active politics : ఆయన బ్యాటు పట్టి పొలిటికల్ గ్రౌండ్‌లో చెలరేగిపోతాడని, అధిష్టానం ఆశలు పెట్టుకుంది. ప్రత్యర్థుల బౌన్సర్లను బౌండరీ దాటిస్తాడని నమ్మకం పెంచుకుంది. లేటుగా పార్టీలోకి వచ్చినా, లేటెస్టుగా టాప్ ఆర్డర్‌లో చోటిచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ విసిరే గూగ్లీలను, పాల్ ఆడమ్స్ బంతుల్లా సిక్సర్ల మోత మోగిస్తాడని గ్యాలరీలలో కూర్చుని ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ ఆయన పెవిలియన్ నుంచి గ్రౌండ్‌లోకి ఎంటరే కావడం లేదు. అప్పుడప్పుడు వచ్చినా బౌండరీ లైన్ దగ్గర సైలెంట్‌గానే వుంటున్నాడు. భారత క్రికెట్ జట్టుకు పునర్ వైభవం తెచ్చిన ఆ మాజీ కెప్టెన్, హైదరాబాదీ మణికట్టు సొగసరి ఆటగాడు, పొలిటికల్ ఫీల్డ్‌లో ఎందుకు కామ్ అయ్యాడు? మనసును గులాబీ గ్రౌండులో పారేసుకోవడమే, ఆ మౌనానికి కారణమా?
మహ్మద్ అజహరుద్దీన్.. భారత క్రికెట్‌లో ఒకప్పుడు ఈ పేరు సంచలనం. అజర్ ఉన్నాడంటే చాలు గెలుపు, ఇండియన్ టీందేనన్న ఒక నమ్మకం. ఆయన క్రీజ్‌లో ఎంటరయ్యాడంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలే. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీంఇండియాను ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించిన ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ పట్ల, భారత కాంగ్రెస్ కూడా చాలా నమ్మకం పెట్టుకుంది. పీకల్లోతు ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన ఆ టైంలోనూ, పార్టీ అనే టీంలోకి రారమ్మని ఆహ్వానించింది. వచ్చీరాగానే టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లోకి దించింది. ఉత్తరప్రదేశ్ వేదికగా జరిగిన పార్లమెంట్ మ్యాచ్‌లో ఎంపీగా గెలిచారు అజర్. గెలిచాడు అనేదానికంటే, విన్నింగ్‌కు అనుకూలించే పిచ్‌లోనే రంగంలోకి దింపి కాంగ్రెస్సే గెలిపించుకుంది అనడమే కరెక్టు. ఐదేళ్లూ దేశమంతా ఎక్కడంటే అక్క,డ, ఎన్నికలు జరిగిన ప్రతిచోటా క్యాంపెయిన్‌లో కామెంటేటర్‌గా మాట్లాడించింది. సెలబ్రిటీ క్రికెటర్, అందులోనూ మైనార్టీ నాయకుడు కాబట్టి, దేశమంతా మైనార్టీలు మనవైపు చూస్తారన్నది కాంగ్రెస్ వ్యూహం. 2014లో దేశ సార్వత్రిక సమరంలో ఓటమి చెందిన కాంగ్రెస్, అజహరుద్దీన్‌కు అచ్చొచ్చిన, ఓన్ స్టేట్‌కు పంపింది. అంటే తెలంగాణ పిచ్‌కు అన్న మాట.
తెలంగాణలో ముస్లిం ఓట్లు అటు కేసీఆర్, మరోవైపు ఎంఐఎం వాటాలేసుకుని మరీ కొల్లగొడుతున్న టైంలో, అజహరుద్దీన్ అనే అస్త్రాన్ని ప్రయోగించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే దాదాపు వైఎస్ కెప్టెన్ హోదాను అజర్‌కు కట్టబెట్టింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గూగ్లీలను బౌండరీలకు దాటిస్తారని, ముస్లిం ఓట్లను నిలబెడతారని అంచనా వేసింది. కనీసం తొలి నుంచి ఓటు బ్యాంకుగా వున్న మైనార్టీ ఓట్లనైనా కాపాడతారని అజర్ పట్ల ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది. ఊరూరా తిరుగుతూ, అధికార టీఆర్ఎస్‌కు, దాని బీ టీంగా భావించే ఎంఐఎంను కట్టడి చేసి, కాంగ్రెస్‌లో పునరుజ్జీవం తెస్తారని, ఢిల్లీ గ్యాలరీలో కూర్చుని ఉత్కంఠగా ఎదురుచూశారు సోనియా. కానీ ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాటం కాదు కదా, కనీసం పెవిలియన్ దాటి గ్రౌండ్‌లోకీ ఎంటర్ కావడంలేదని రగిలిపోతున్నారట సోనియా. అసలు గాంధీభవన్‌కు సెలబ్రిటీలా కూడా అలా వచ్చి, ఇలాపోవడం లేదని, పూర్తిగా పెవిలియన్‌కే పరిమితమయ్యారని టీం మెంబర్స్ సైతం ఫీలవుతున్నారు. అయితే, పెవిలియన్‌లో కూర్చున్న టైంలో, అజర్ మనసు మాత్రం, మరో మ్యాచ్‌పై కేంద్రీకృతమైందన్న చర్చ జరిగింది. అదే హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు.
ఎంపీగా పోటీ చేసి, ఐదేళ్లు ఆ ప్రోటోకాల్ అనుభవించిన అజారుద్దీన్ మనసు మాత్రం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టే తిరిగింది. ఎప్పుడైతే ఎంపీ సీటు దిగిపోయారో, నాటి నుంచి హెచ్‌సీఏ పీఠం కోసం నిరంతరం ప్రయత్నించారు అజర్. కానీ ఒకసారి కాకా కొడుకు వినోద్‌తో జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు అజర్. దాన్ని అవమానంగా భావించారు. ఆసీస్ క్రికెటర్ల స్లెడ్జింగ్ పట్ల స్టేడయింలో ఎలా ఉడికిపోయారో, అలాగే రగిలిపోయారు. ఎలాగైనా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి పొందాలనుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు. గెలిచారు. దీంతో అజర్ ఎన్నో ఏళ్ల కల ఫలించిందినట్టయ్యింది. కానీ హోరాహోరీగా పోరు జరుగుతుందనుకుంటే, చాలా సునాయాసంగా అజర్‌ను విజయం వరించడంతో, చాలామంది ఫిక్సింగ్ డౌట్లే వచ్చేశాయి.
హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపుకు అధికార టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా గెలుపుకు సహకరించారన్న మాటలు వినపడ్డాయి. ఎలాగైనా గెలవాలనుకున్న అజర్, గులాబీ దండుతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి, ఈజీ విజయం సాధించారన్న మాటలు జోరుగానే వినపడ్డాయి. ఈ ఆరోపణలు నిజమేనన్నట్టుగా, నాటి నుంచి అజర్ సైతం తన సొంత టీం, అంటే కాంగ్రెస్‌తో టచ్‌లో లేరు. పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. క్రికెట్ అసోషియేన్ ఎన్నికల్లో మంత్రి కేటిఆర్ స్వయంగా రంగంలో దిగి అజారుద్దీన్ గెలుపుకు లైన్ క్లియర్ చేశారనే చర్చ కూడ బాగా జరిగింది. అయితే వీహెచ్ కూడా అజర్ గెలుపు కోసం చాలా శ్రమించారు. అయినా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయిన నాటి నుంచి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పార్టీలో పత్తా లేకుండా పోయారనే చర్చ గాంధీభవన్ జోరుగా వినిపిస్తోంది. గ్యాలరీలో కూర్చుని చూస్తున్న సోనియాకు, టీంమెంబర్స్‌కు కూడా అజర్ ఆటతీరు మింగుడపడటం లేదట.
అజ్జూ భాయ్ తెలంగాణ కాంగ్రెస్‌లో వున్నారో లేరో ఎవరికీ అర్థంకావడం లేదు. పార్టీ కార్యక్రమాలు, నిరసనలు, మీడియా సమావేశాల్లో అజర్ కనిపించడం లేదు. తనతో పాటు వర్కింగ్ ప్రెసిండెంట్లయిన రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కుసుమ్ కుమార్‌లు మాత్రం పార్టీ కార్యక్రమాలకు తరచుగా హాజరవుతున్నారు. కరోనా టైంలో అధికారపక్షాన్ని ఇరుకునపెడుతున్న కాంగ్రెస్‌లో, అజర్ స్వరం మాత్రం వినిపించడం లేదు. తనను హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలిపించిన టీఆర్ఎస్ పట్ల విధేయత కోసమే, ఆయన సొంత పార్టీ పట్ల అవిధేయత చూపిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. గతంలోనే ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. మనసంతా గులాబీ గ్రౌండ్‌లో వదిలేసుకున్న అజర్, అన్యమనస్కంగా గాంధీభవన్ మైదానంలో వున్నారని అర్థమవుతోంది. రేపోమాపో ఆయన టీఆర్ఎస్‌లోకి అధికారికంగా వెళ్లినా ఆశ్చర్యంలేదనేవారున్నారు.
మొత్తానికి భారత క్రికెట్ టీంను నాడు రివైవల్ చేసినట్టు, తెలంగాణ కాంగ్రెస్‌ను సైతం పునరుజ్జీవం చేస్తాడని అజర్‌పై అధిష్టానం చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ తనకిష్టమైన హెచ్‌సీఏ కిరీటం తనకుదక్కింది. రేపోమాపో ఆ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత తాను మనసుపడ్డ గులాబీ టీంలోకి వెళతారా, వరుసగా వికెట్లన్నీ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో వున్న తెలంగాణ కాంగ్రెస్‌లోనే వుండి, విన్నింగ్ షాట్ కొట్టి, అధికారమనే ట్రోఫీ సోనియాకు అందిస్తాడా అజర్ బ్యాటింగ్ ఏంటో, ఆయన పరుగులు ఎటువైపో రానున్న కాలమే చెప్పాలి.