Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్
Telangana: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈటెలతో భేటీ అయ్యారు.
Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుందా?.. అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. పూర్తి వివరాల్లోకి వెళితే... కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి ఇప్పటికే ఈటలతో భేటీ కాగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ కూడా శుక్రవారం ఆయనతో భేటీ అయ్యారు. మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఈటల నివాసానికి వచ్చిన రాములు నాయక్ గంటన్నరకు పైగా ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం 3 గంటలకు ఈటల బయటకు వచ్చి కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా.. రాములు నాయక్ సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. గత పది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటలతో ఇతర పార్టీల నేతలు వరుసగా భేటీ కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.
అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈటల ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడ్డారు. కొత్త పార్టీని స్థాపించాలా? లేదంటే మరో పార్టీలో చేరాలా? అనే అంశంపై అనుచరులు, మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్ణయంపై ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.