సరిహద్దులో కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలొడ్డి చేసిన సమరనాదం ఇదే!

Update: 2020-06-23 15:50 GMT

ఒళ్లంతా గాయాలు.. ఎదురుగా శత్రుబలగాలు.. తన వెనుక తక్కువ మంది సైనికులు.. అయినా బెనకలేదు. వెనక్కు తగ్గలేదు. శత్రుమూకలపై సింహాంలా గర్జించాడు. భారత భూభాగంలోకి చొచ్చుకస్తున్న చైనా డ్రాగన్లను అడ్డుకున్నాడు. భారత గడ్డపై డ్రాగన్ల అడుగు పడకుండా తుది వరకు పోరాడి చివరకు అమరుడయ్యాడు. దేశం మీసం తిప్పిన కర్నల్ సంతోష్ బాబు విరోచిత పోరాటం ఎలా సాగిందో చూద్దాం..

చైనా దుశ్చర్యపై గర్జించాడు తెలుగు యోధుడు. వందమందితేనే 3వందల 50 మందిపై పోరు సాగించాడు. మృత్యు ఒడిలోనూ ఆయన ప్రదర్శించిన నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి, ఎదురించిన ధైర్యం చిరస్మరణీయం. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఈ నెల 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు వీర మరణం పొందారు. సంతోష్‌ నేతృత్వంలో మన బలగాలు వీరోచిత పోరాటం సాగించాయి.

చైనా, భారత్ సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వేడిని చల్లార్చేందుకు ఈ నెల 6న రెండు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల సమావేశమయ్యారు. అందులో కుదిరిన ఒప్పందం ప్రకారం.. చైనా సైనికులు గల్వాన్ లోయలో ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించారు. అయితే అకస్మాత్తుగా ఈ నెల 14న మళ్లీ గుడారాలను ఏర్పాటు చేసింది చైనా సైన్యం. ఈ అంశంపై స్థానిక చైనా కమాండర్‌తో కర్నల్‌ సంతోష్‌ బాబు చర్చలు కూడా జరిపారు. ఐనా డ్రాగన్ల తీరు మారలేదు.

గల్వాన్‌ లోయలో చైనా ఏర్పాటు చేసిన పెట్రోలింగ్‌ పాయింట్ ను తొలగించాలని '16 బిహార్‌' రెజిమెంట్‌ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కానీ డ్రాగన్‌ దళాలు మొండికేశాయి. మన బలగాలు ఈ విషయాన్ని సంతోష్‌ బాబుకు తెలియజేశారు. ఇలోగా చైనా సైనికులు పక్కా ప్రణాళికతో అక్కడికి భారీగా అదనపు బలగాలను రప్పించారు.

భారతభూభాగంలో చైనా ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించేందుకు తెలుగు వీరుడు సంతోష్‌ బాబు రంగంలోకి దిగారు. నేరుగా ఆయన తన బలగాలతో కలిసి శిబిరం వద్దకు వెళ్లారు. అక్కడ చైనా అదనపు బలగాలను దింపినట్లు సంతోష్ బాబు పసిగాట్టారు. ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేయడం అక్రమమని చైనా కమాండర్‌కు సంతోష్‌ స్పష్టంచేశారు. ఐనా డ్రాగన్లు మెండీగా ప్రవర్తించారు.

చైనాసైన్యాన్ని వెనక్కి వెళ్లాలని భారత సైన్యం కోరుతోంది. కానీ ఒక్కసారిగా భారతసైనికులను తోసివేయడం మొదలుపెట్టారు చైనా బలగాలు. ఇరుపక్షాల సైనికులు పిడిగుడ్డులతో విరుచకపడ్డారు. ఈ పోరులో సైనికులిద్దరూ గాయపడ్డారు. సంతోష్‌ బాబు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయినా ఆయన వెనకడుగు వేయకుండా తన బలగాన్ని ముందుండి నడిపించారు. గాయపడిన భారత సైనికులను వెనక్కి పంపి, అదనపు బలగాలను రప్పించారు.

కొద్దిసేపటి తర్వాత పెద్దసంఖ్యలో చైనా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. మేకులు కలిగిన ఇనుపకడ్డీలతో మన బలగాలపై దాడి చేశారు. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కర్నల్‌ సంతోష్‌బాబు నాయకత్వంలో భారత బలగాలు భీకర పోరాటం చేశాయి. చైనా శిబిరాలను చెల్లాచెదురుచేశాయి.

రాత్రి అవుతున్న అక్కడ రాజుకున్న అగ్గిచల్లారడం లేదు. గల్వాన్‌ నది ఒడ్డున, కొండల్లో మాటు వేసిన మరిన్నీ చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. వస్తూనే భారత సైనికులపై పెద్ద రాళ్లతో దాడి చేశాయి. సంతోష్‌ తలపై ఒక పెద్ద రాయి పడింది. దీంతో ఆయన గల్వాన్‌ నదిలోకి ఒరిగిపోయారు. తమ కమాండింగ్‌ అధికారి నేలకొరగడంతో భారత సైనికులు ఊగిపోయారు. చైనా సైనికులపై విరుచుకుపడ్డారు.

గల్వాన్‌ లోయలో దాదాపు 3 గంటల పాటు సాగిన పోరాటంలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు విడిచారు. సంతోష్‌ సహా పలువురు 20 మంది భారత జవాన్ల మృతదేహాలను మన సైన్యం వెనక్కి తీసుకెళ్లింది. చైనా సైనికుల మృతదేహాలు మాత్రం అక్కడే పడి ఉన్నాయి. కర్నల్ సంతోష్ సైన్యం ప్రాణాలు అర్పించి, అక్రమంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని విజయవంతంగా తొలగించింది. 

Tags:    

Similar News