Crop Loan Waiver : రైతులకు పండగ రోజు...నేడు వైరా వేదికగా రూ. 2లక్షల రుణమాఫీ విడుదల
Crop Loan Waiver :తెలంగాణలో నేడు రైతులకు పండగ రోజు. ఆగస్టు 15వ తేదీ వరకు రూ.2లక్షల రుణమాఫీ నేటితో పూర్తి అవుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నేటితో తీరనుంది. ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్న వరకు రైతులకు రుణమాఫీ చేసింది. లక్షన్న నుంచి రూ.2లక్షలోపు రుణమాఫీ ప్రక్రియను నేడు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేస్తారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తారు.
Crop Loan Waiver : ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2లక్షల రుణమాఫీ నేటితో పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మందికి పైగా రైతులకు రుణ విముక్తులను చేసేందుకు రూ .31వేల కోట్ల రూపాయలు సర్కార్ కేటాయించింది. లక్ష వరకు రుణం ఉన్న 1114412 మంది రైతులకు జులై 18 వ తేదీన రూ. 6034కోట్లు రిలీజ్ చేసింది. లక్ష నుంచి లక్షన్నరలోపు రుణాలు ఉన్న 6లక్షల 40వేల 823 మంది రైతుల ఖాతాలో జులై 30న 6190 కోట్లను జమ చేసింది. లక్షన్నర నుంచి 2లక్షల వరకు లోను ఉన్న రైతులకు నేడు రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవుతుంది.
మూడో విడత లక్షన్నర నుంచి 2లక్షల వరకు రుణమాఫీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా పూర్తి చేస్తారు. ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రుణమాఫీని ప్రకటించనున్నారు. ఆ వెంటనే రైతుల అకౌంట్లోకి మాఫీ సొమ్మును జమ చేయనున్నారు. సీఎం పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 50వేల మందికి పైగా జనసమీకరణ చేస్తుండగా సభను రైతు పండుగలా నిర్వహిస్తారు.
అటు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 9లక్షల 20వేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు డిజైన్ చేశారు. మూడు పంప్ హౌస్‌ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ట్రయల్ రన్ పూర్తయ్యింది. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమలాపుర్ పంప్‌హౌస్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు తొలిపంప్ హౌస్‌ను జిల్లా ఇంఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడికి చేరుస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని..మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో రూ. 2 లక్షలకు మించి క్రాప్ లోన్స్ ఉన్న రైతులను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్లు తెరపైకి రావడం తెలిసిందే. కౌలు రైతుల అప్పులు కూడా మాఫీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.