Malkajgiri: మల్కాజ్‌గిరిపై గురి.. పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సీఎం భేటీ
Malkajgiri: మల్కాజ్‌గిరి పార్లమెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష
Malkajgiri: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం హోదాలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఆయనకు సవాల్‌గా మారిన దృష్ట్యా సమీక్షలు షురు చేశారు. ఇందులో భాగంగానే గతంలో తాను ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. లోక్‌సభ ఎన్నికలపై ఆ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చర్చించారు.
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరి అన్నారు రేవంత్. ఆనాడు ఎంపీగా గెలుపే.. ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు. 2019 మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి కేసీఆర్ పతనం మొదలైందని కార్యకర్తలతో సమావేశంలో అన్నారు. గతంలో నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు తనను గెలిపించుకున్నారన్నారు రేవంత్. మల్కాజ్‌గిరిలోని 2 వేల 964 బూత్‌లలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారని కొనియాడారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్రమంతా తుఫాన్ వచ్చిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు రేవంత్. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాలు గెలిచినా మల్కాజ్‌గిరిని డెవలప్‌మెంట్ చేసేందుకు ఛాన్స్ ఉండేదన్నారు. అందుకే మల్కాజ్‌గిరి పార్లమెంట్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు రేవంత్. హోలీ పండుగ తర్వాత ఉప ఎన్నిక కోసం అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు రేవంత్. కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉన్న దృష్ట్యా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.
ఇక మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. కమిటీలోని సభ్యులు పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలని కోరారు. మల్కాజ్‌గిరి ఎన్నికల క్యాంపెయిన్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థిది కాదు.. ముఖ్యమంత్రిదని అన్నారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.