KCR Speech on PV Narasimha Rao: పీవీ మన ఠీవీ..ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చారు : సీఎం కేసీఆర్
KCR speech on PV Narasimha rao: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
KCR speech in PV Narasimha rao 100th birthday celebrations: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అని అన్నారు. విద్యాశాఖ పేరును హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనేనన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్‌లో గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఆయన పాఠశాల నుంచి ఎంతో మంది ఐపీఎస్‌లు వచ్చారని అన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఆయన పాఠశాల నుంచి వచ్చిన వారే అని గుర్తు చేశారు. పీవీ సంస్కరణల లక్ష్యానికి నిలువెత్తు రూపమని ఆయన కొనియాడారు. అందుకు తగ్గట్లుగానే ఆయన మాటకు ఎంతో విలువ ఉండేదని అన్నారు. నవోదయ వంటి పాఠశాల ఏర్పాటులో పీవీ భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. అంతే కాదు జైళ్లశాఖలో కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పీవీ జీవిత ప్రస్థానమంతా సంస్కరణలతో సాగిందన్నారు.
తాను నమ్మింది, అనుకున్నది గొప్పగా చెప్పిన వ్యక్తి అన్నారు. ప్రపంచదేశాలకు ఉత్తమ సందేశాలను ఇచ్చారన్నారు. పీవీ 1200 ఎకరాల భూస్వామి అని ఆయన ఓ 150 ఎకరాలు ఉంచుకొని మిగతా అంతా ఉదారంగా ప్రభుత్వానికి అప్పగించారని కేసీఆర్ గుర్తు చేసారు. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారన్నారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసి సంస్కరణలు తెచ్చారన్నారు. ఇది మాత్రమే కాకుండా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. అందుకే పీవీ మన ఠీవీ అని నేను అంటునానన్నారు. గెలుపులో, ఓటమిలో ఎప్పుడూ నిశ్చలంగా ఉండే వ్యక్తి ఆయన అని అన్నారు. ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశమంతా అంధకారమయంలో ఉంది. ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం చేరేవరకూ పట్టు సడలించేవారు కాదు. ఉన్న బంగారమంతా విదేశీ బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకున్న సందర్భం అది. ఆర్థిక సంస్కరణ లతో దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించి సంచలన రేపారన్నారు. 'దేశానికి గొప్పగా దిశానిర్దేశం చేసిన వ్యక్తికి రావాల్సిన గౌరవం ఆయనకు లభించలేదని కేసీఆర్ అన్నారు. ఆయన విధానాలను ముందు తరాలకు తెలియజేస్తే వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక అవుతుందన్నారు. మన రాష్ట్రం తరపున పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేయాలని కేసీఆర్ మాట్లాడారు. ఆయన వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు. ప్రధాని పదవి మూటలు కట్టి తెచ్చుకోలేదు. ఆయన్ను వరించి వచ్చిందని పేర్కొన్నారు.