CM KCR: సచివాలయ నిర్మాణం వేగవంతం చేయాలి
CM KCR: గడుపులోగా కట్టడం పూర్తి చేయాలి-కేసీఆర్ * కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
CM KCR: సచివాలయ నిర్మాణాలను వేగవంతం చేయాలని, గడుపులోగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, సచివాలయం పాలనా రీతులకు అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టి పైఅంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
వెయిటింగ్‌హాలు, పార్కింగ్, హెలిప్యాడ్ నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్ ఇంజినీర్లు, అధికారుల ద్వారా పనుల పురోగతిని తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, సందర్శకులు, ప్రముఖులకు బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా రోడ్ల నిర్మాణాలుండాలన్నారు.
మొత్తం ఆరు అంతస్తుల్లో.. ఆరు నుంచి ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాల విభాగాలన్నింటినీ అనుసంధానించేలా నిర్మాణం చేపట్టారు. ఒక శాఖకు చెందిన మొత్తం వ్యవస్థ ఒకేచోట ఉండేటా ప్రణాళిక రూపొందించారు. ఇక వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి సచివాలయ పనులన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నారు.