టీఆర్ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌కి విశ్వఖ్యాతి తీసుకొచ్చేలా తమపార్టీ కృషి చేస్తోందన్న కేసీఆర్ నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
అటు నగర ప్రజలకు గులాబీ బాస్ వరాల జల్లు కురిపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత త్రాగు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నుంచి వాటర్ బిల్లులు చెల్లించక్కర్లేదంటూ స్పష్టం చేశారు. ఇకపై నగరంలో 97శాతం ప్రజలకు ఉచిత నీటిని సరాఫరా చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇకపై సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అటు సినిమా థియేటర్లకు కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇటు కార్మికులు పడే కష్టాలపై స్పందించిన కేసీఆర్.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. కరోనా కాలానికి సంబంధించిన మోటారు వాహన పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.