CM KCR: ఆగస్టు 2న హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

CM KCR: ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు * సాగర్ ఉప ఎన్నికల్లో వరాల జల్లు కురుపించిన సీఎం

Update: 2021-07-31 02:45 GMT
ఆగష్టు 2 న హాలియాలో సీఎం కెసిఆర్ సభ (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నికల టెన్షన్ పట్టుకుందా వచ్చే నెల 2న నాగార్జున సాగర్ పర్యటన వెనుక అంతర్యం ఏంటి..? సాగర్ ఉప ‎ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిన సీఎం వాటిని గాలికి వదిలేశారని వస్తు్న్న ఆరోపణల నేపథ్యంలో పర్యటన చేయనున్నారా..? నాగార్జున సాగర్ హామీల ఎఫెక్ట్ హుజూరాబాద్‌లో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా.

సాగర్ ఉప ఎన్నిక కంటే ముందు జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చూశారు గులాబీ బాస్ కేసీఆర్. తరువాత గ్రాడ్యుయేట్ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. రెండు ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యహరిస్తూ ప్రజల నాడిని టీఆరెస్ వైపు తిప్పుకోనేల వ్యూహాలకు పదును పెట్టారు. జానారెడ్డి లాంటి వ్యక్తిని సాగర్ లో, హైదరాబాద్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం అయిన బీజేపీ ప్రజలకు దూరం చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే ఈ రెండు ఎన్నికల్లో టీఆరెస్ ఘన విజయానికి ప్రధాన కారణం ఆయా ఎన్నికల్లో సీఎం ప్రజలకు ఇచ్చిన హామీలే అంటున్నారు టీఆరెస్ నేతలు.

సాగర ఉప ఎన్నిక సందర్భంగా స్వయంగా సీఎం కేసీఆర్ అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి వరాల జల్లు కురిపించారు. జానారెడ్డి ఏళ్ల తరబడి ప్రాతినిధ్యం వహించి ఏం చేశారో... టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక సాగర్ లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో స్థానిక ప్రజలు గ్రహించాలని కోరుతూ అనేక హామీలను గుప్పించారు.

హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అనేక వరాల జల్లు కురిపించారు. ఇందులో కోదాడ నుంచి హుజుర్‌నగర్ మీదుగా నాగార్జున సాగర్ వరకు పర్యటిస్తానని, ప్రజలను, రైతులను నేరుగా కలుస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ పర్యటన జరగలేదు. ఇక హుజుర్‌నగర్ లో గతేడాది సెప్టెంబరు 23న నిర్వహించిన కృతజ్ఞత సభలో కేసీఆర్ మొత్తం 134 గ్రామ పంచాయతీలకు సీఎం ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 20 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. జీవోలైతే వచ్చాయి గానీ నిధులు మాత్రం విడుదల కాలేదు అంటున్నారు అధికారులు.

నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఇరిగేషన్ భూముల సమస్యలను పరిష్కరిస్తామని, ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలిస్తామని తెలిపారు. నందికొండలో బీసీ డిగ్రీ కళాశాల, హాలియాలో షాదీఖానా, ఖబస్తాన్ నిర్మాణం, ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, పింఛన్లు లాంటి హామీలను ఇచ్చారు సీఎం.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సాగర్ ప్రభావం పడకుండా సీఎం వచ్చే నెల మొదటివారంలో హాలియ వెళ్లనున్నారు. హుజూరాబాద్ లో దళిత బంధు ప్రాజెక్టు సందర్భంగా సాగర్ ఎన్నికల హామీల మాదిరిగానే ఈ హామీలు మిగిలిపోతాయని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ హాలియా టూర్ కు సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ టూర్ చేస్తున్నారని పొలిటికల్ చర్చ జరుగుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అర్ధం అవుతోంది. 

Tags:    

Similar News