CM KCR: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ

CM KCR: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు

Update: 2021-10-18 13:42 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా పెరుగుతున్న నేపథ్యంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొంటారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ అక్కడక్కడా తిరిగి తలెత్తుతున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన కఠిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టవలసిన కార్యాచరణను సమావేశం రూపొందిస్తుంది.

Tags:    

Similar News