ఎమ్మెల్యేలకు ఎర కేసులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్
CM KCR: నలుగురు ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్
CM KCR: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల ఢిల్లీ వేదికగానే బీజేపీని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారని సమాచారం. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే యత్నంపై సీఎం కేసీఆర్ రెండ్రోజుల నుంచి ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు.
నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డితో పాటు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ఇతర ముఖ్య నేతలు సమీక్షల్లో పాల్గొన్నారు. మొత్తం వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని సేకరించి సమగ్ర నివేదికను తయారు చేసినట్లు తెలిసింది. జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ నిన్న మీడియా ముందుకు వస్తారని ప్రచారం జరిగినా ఆయన వ్యూహాత్మక మౌనం పాటించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం వెనుక ఉన్న కీలక వ్యక్తుల తతంగాన్ని ఢిల్లీలో జాతీయ, అంతర్జాతీయ మీడియా ద్వారా జాతీయస్థాయిలో ఎండగొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.