CM KCR: కాసేపట్లో హుజురాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభం
CM KCR: దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: సమాజంలో దళితులకు ఒక గుర్తింపు ఉండాలని, దళితుల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం నేడు ప్రారంభం కానుంది. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 15 మంది లబ్దిదారులకు పథకాన్ని అందించనున్నారు. అనంతరం దళితులను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబం 10లక్షల రూపాయలు పొందనుంది.
ఇక.. హుజురాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో.. నియోజకవర్గమంతా పండగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు నియోకవర్గ ప్రజలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎటు చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, టీఆర్‌జెండాలతో నియోజకవర్గాన్ని గులాబీ మయం చేశారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, జై కేసీఆర్ అంటూ రాతలు, దళిత దేవుడు సీఎం అంటూ డిజైన్లు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క.. సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పుల దరువులతో హుజురాబాద్‌లో సందడి నెలకొంది.
ఇంటికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ సాయం అందిస్తున్నారని కొనియాడుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇప్పటికే కల్యాణలక్ష్మి పథకంతో పేద ఆడపిల్ల తండ్రికి కాస్త భారం తగ్గించిన కేసీఆర్.. ఇప్పుడు దళితబంధు ద్వారా మరింత సాయం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.