ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

MLA Sayanna: సాయన్న మృతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం

Update: 2023-02-19 11:36 GMT

ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సాయన్న కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న మృతి చాలా బాధకరమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అన్నారు. మరోవైపు సాయన్న కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. సాయన్న నివాసానికి భారీగా కార్యకర్తలు, అనుచరులు చేరుకుంటున్నారు.

ఎమ్మెల్యే సాయన్న.. నిత్యం ప్రజా సమస్యల కోసమే పోరాడారన్నారు మంత్రి తలసాని. సాయన్న మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా.. ప్రజల కోసం పనిచేశారన్నారు. ప్రజల సందర్శనం కోసం రేపు ఉదయం కార్ఖానాలోని ఆయన క్యాంప్ ఆఫీస్‌కు పార్థివ దేహం తరలిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం బన్సీలాల్‌పేటలోని స్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు తలసాని తెలిపారు.

కొంతకాలంగా సాయన్న గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు సాయన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 నుంచి 2009 వరకు మూడుసార్లు టీడీపీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి గెలిచారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన సాయన్న... 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37వేల 568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు సాయన్న.

Tags:    

Similar News