Telangana: ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
Telangana: ఈ ఏడాది చివరికల్లా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి
Telangana: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కృష్టా బేసిన్‌లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ అధికారులు పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పనులను మరింత వేగవంతంచేసి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ నీటి గోస, నల్గొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా తన ప్రసంగం సాగలేదని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్ నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే నిర్లక్ష్యం చేశారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని భావించినప్పటికీ కొందరు దుర్మార్గులు కోర్టుల్లో కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడ్డారని గుర్తుచేశారు. అయినప్పటికీ, పట్టుదలతో వేగంగా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
జూరాలతోపాటు ఇప్పటికే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని దక్షిణ పాలమూరులో 11లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడక్కడా కొన్ని పనులు మిగిలాయన్న కేసీఆర్వా టిని కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. కాళేశ్వరం స్ఫూర్తిగా పనులను ముందుకు తీసుకెళ్లాలని ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏదిఏమైనాసరే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి తీరాలన్నారు.