IAS Amrapali Kata: ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళాల్సిందేనా... ఆమె ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఏపీకి వెళ్తున్న మరో 8 మంది ఐఏఎస్‌లు ఎవరు?
Options In Front Of IAS Amrapali Kata: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఏపీ కేడర్‌కు వెళ్లాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ - డీఓపీటీ అక్టోబర్ 10న ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్‌ను నియమించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకున్నాయి. ఆమెతో పాటు తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఎఎస్ఎలు, ముగ్గురు ఐపీఎస్‌లు ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఏపీలో పనిచేస్తున్న నలుగురు ఐఎఎస్‌లు తెలంగాణకు రానున్నారు.
ఏం జరిగింది?
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ఈ నెల 16 లోపుగా ఏపీలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమాచారం పంపింది కేంద్రం. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను సర్దుబాటు చేసింది కేంద్రం. ఈ సమయంలో ఆలిండియా సర్వీస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్‌లను కేటాయించింది. కొందరు తమకు ఏపీ కేడర్ కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను తెలంగాణ కేడర్‌గా గుర్తించాలని కోరారు. ఇందుకు పలు కారణాలను చూపారు.
ఈ విషయమై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్ధనను క్యాట్ అంగీకరించింది. అయితే ఈ తీర్పును డీఓపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. 2023 మార్చిలో ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అధికారుల అభ్యర్ధనను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిషన్‌ను 2024, మార్చి 21న కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆమ్రపాలి సహా కేడర్‌పై అభ్యంతరాలు తెలిపిన పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్ధనలను పరిశీలించింది. వ్యక్తిగతంగా వారిని విచారించింది. ఖండేకర్ కమిటీ కూడా ఆమ్రపాలి సహా ఇతర అధికారుల అభ్యర్ధనలను తిరస్కరించింది. ఈ కమిటీ సూచన మేరకు డీఓపీటీ మాత్రం ఏపీ కేడర్‌కు కేటాయించిన ఆలిండియా సర్వీస్ అధికారులను ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఆదేశించింది.
ఆమ్రపాలికి అదే నష్టం చేసిందా?
తెలంగాణ స్థానికురాలిగా తనను గుర్తించాలని ఆమ్రపాలి డీఓపీటిని కోరింది. 2014లోనే కేడర్ కేటాయింపు సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ముందు కూడా ఆమె ఇదే వాదన చేసింది. అయితే ఈ వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఆమెను ఏపీ కేడర్‌కే అలాట్ చేసింది. యూపీఎస్‌సీకి దరఖాస్తు చేసిన సమయంలో ఆమ్రపాలి తన పర్మినెంట్ అడ్రస్‌ను విశాఖపట్టణంగా చూపారు. ఇది కూడా ఆమ్రపాలికి ఏపీ కేడర్ కేటాయించడానికి కారణమైందనే వాదన కూడా ఉంది.
తెలంగాణ నుంచి సెంట్రల్ సర్వీసుల్లోకి
ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె తెలంగాణలో పనిచేశారు. తొలుత ఆమె వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొంతకాలం ఉన్నారు. 2015 జనవరిలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పించి వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించారు. ఆ తరువాత వరంగల్ రూరల్ కలెక్టర్‌గా కొనసాగారు. వరంగల్ నుంచి హైద్రాబాద్‌కు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పనిచేశారు. 2019 జులై 12 ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలోనూ, ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణకు
కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలి తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఆమెను 2023 డిసెంబర్ 14న హెచ్ఎండీఏ కమిషనర్‌గా నియమించారు. ఈ ఏడాది జూన్ 24న ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అపాయింట్ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమె కొనసాగుతున్నారు.
ఆమ్రపాలి ముందున్న ఆప్షన్స్ ఏంటి?
డీఓపీటీ ఆదేశాలపై ఆమ్రపాలితో పాటు మిగిలిన ఆలిండియా సర్వీస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. డీఓపీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరవచ్చు. అయితే గతంలో సోమేష్ కుమార్ విషయంలో క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసింది. ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ తీర్పును డీఓపీటీ ప్రస్తావించవచ్చు. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అధికారుల విషయంలో పరస్పర అంగీకరిస్తే వీటిని తాత్కాలికంగా ఆపవచ్చు. అయితే ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి అనుమతి తీసుకోవాలి. అయితే ఇందుకు సరైన కారణాలను చూపాలి.
అప్పట్లో సోమేష్ కుమార్‌కు ఇదే పరిస్థితి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ కూడా ఏపీ కేడర్ అధికారి. అయితే తనకు తెలంగాణ కేడర్ కేటాయించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు 2023, జనవరి 10న రద్దు చేసింది. క్యాట్ ఉత్తర్వులను కేంద్రం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఈ తీర్పు వచ్చింది. దీంతో ఆయన ఏపీకి వెళ్లారు. ఏపీలో జాయిన్ అయ్యాక సెలవు పెట్టారు. వెంటనే వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వీఆర్ఎస్‌కు ఆమోదం లభించింది.
ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఎనిమిది మంది
ఆలిండియా సర్వీస్ అధికారులు 8మంది తమకు తెలంగాణ కేడర్ కేటాయించాలన్న అభ్యర్ధనను డీఓపీటీ తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, మల్లెల ప్రశాంతి, వాణిప్రసాద్, అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిలు ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి తమను తెలంగాణకు మార్చాలని డీఓపీటీని కోరారు. అయితే ఈ అభ్యర్ధనను డీఓపీటీ తిరస్కరించింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది. మరో వైపు ఏపీలో పనిచేస్తున్న ఐఎఎస్‌లు సృజన, ఎస్ఎస్ రావత్, ఎస్. అనంత రాము, శ్రీనివాస రాజు, శివశంకర్ లాహోటి, హరికిరణ్ కూడా తెలంగాణలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
అయితే ఇప్పటికే ఎస్. అనంత రాము, శ్రీనివాస రాజులు రిటైరయ్యారు. మిగిలిన నలుగురు తెలంగాణలో రిపోర్ట్ చేయాలి. డీఓపీటీ ఆదేశాల మేరకు ఆమ్రపాలి ఈ నెల 16 లోపుగా ఏపీలో రిపోర్ట్ చేస్తారా కోర్టును ఆశ్రయిస్తారా అనేది తేలాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్లో జిల్లాల పెంపుతో ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల అవసరం ఏర్పడింది. ఇప్పటికే తమ రాష్ట్రాలకు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రెండు రాష్ట్రాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరాయి.