Cannabis smugglers: చెలరేగిపోతున్న గంజాయి స్మగ్లర్లు!
Cannabis smugglers: హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు వెళుతుంటాయి.
Cannabis smugglers: హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది వాహనాలు వెళుతుంటాయి. అసలే కరోనా కాలం ఏ వాహనంలో ఏం సరఫరా అవుతుందో ఎవరికీ తెలియదు. ఇదే అదునుగా గంజాయి స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. యథేచ్ఛగా గంజాయి తరలిస్తూ పట్టుబడుతున్నారు. అసలు హైవే పై ఏం జరుగుతోంది.
కొంతకాలంగా హైదరాబాద్ లో మత్తు పదార్థాల వాడకంపై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీంతో యువత, వ్యసనపరులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదే అక్రమ గంజాయి దందాకి డిమాండ్ పెరిగేలా చేసింది. గత నెలలో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల సమీపంలో ఎన్.హెచ్-65 పై ఓ కారు జెట్ స్పీడ్ తో దూసుకెల్తూ అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో డ్రైవర్ అక్కడి నుంచి మాయమయ్యాడు. అనుమానం వచ్చిన పోలీసులు కారులో చూస్తే గంజాయి ప్యాకెట్లు లభించాయి. 200 కేజీలు ఉండే ఈ గంజాయి విలువ లక్షల్లో ఉంటుంది.
ఇక ఇదే హైవేపై నకిరేకల్ మండలం, చందంపల్లి వద్ద ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వెంటనే కారు డ్రైవర్ పరుగులు పెట్టాడు. కారులో ఉన్న 60 ఏళ్ల వృద్ధురాలును ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. 104 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠాని అంతర్ రాష్ట్ర ముఠాగా తేల్చారు. ఛత్తీస్ ఘడ్, వైజాగ్ ల నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, ముంబాయి లాంటి మహా నగరాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్ కు గంజాయిని తరలిస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి 86 కిలోల గంజాయి, ఒక కారు,12 మిక్సీ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నెలలో సూర్యాపేట పాత బస్టాండు దగ్గర పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా ముప్పై ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
హైవేపై పోలీసుల తనిఖీలు లేకపోవడం వల్లే గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ బార్డర్ లో నామమాత్రంగా తనిఖీలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ పై నిఘను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.