Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బైపోల్‌లో BRS గెలుపు, రేవంత్ కు ఎదురు దెబ్బ
Mahbubnagar: 111 ఓట్ల తేడాతో నవీన్‌కుమార్‌రెడ్డి విజయం
Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో BRS ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి 763 ఓట్లు పోల్ కాగా... కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 652ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం..కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.
స్వంత జిల్లాలో రేవంత్ కు ఎదురు దెబ్బ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వంత జిల్లాలోనే ఎదురు దెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది. కాంగ్రెస్ అభ్యర్ధి మన్నె జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్ధి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపడంపై అప్పట్లోనే బీఆర్ఎస్ లు గుప్పించింది. 1439 మంది ఓటర్లలో వెయ్యికిపైగా ఓటర్లు బీఆర్ఎస్ కు చెందినవారే. కాంగ్రెస్ బలం 200కు మించిలేదు. అయినా కూడా ఎన్నికల బరిలోకి దిగింది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు పోటాపోటీగా క్యాంప్ లు నిర్వహించాయి. తమ ఓటర్లలో కొందరిని తమ వైపునకు తిప్పుకుందని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు చేసింది.
కాంగ్రెస్ పార్టీకి 653 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే గణనీయంగానే ఓట్లు లభించాయి. అయితే మరికొన్ని ఓట్లను దక్కించుకొంటే కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డికి విజయం దక్కేదే. కానీ, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను బీఆర్ఎస్ కౌంటర్ చేసింది. దీంతో కారు పార్టీ విజయాన్ని స్వంతం చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దరిమిలా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికను ఈ ఏడాది మార్చి 28న నిర్వహించారు.
అప్పట్లో రేవంత్ గెలుపు....నేడు కాంగ్రెస్ ఓటమి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలోని మిడ్జిల్ జడ్పీటీసీ గా ఇండిపెండెంట్ గా 2006లో రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2007లో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి టీడీపీ మద్దతు ప్రకటించింది. 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2009లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్సీ స్తానానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బలం లేకున్నా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది.