BRS: ఎన్నికల గుర్తులపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన BRS ప్రతినిధులు
BRS: ఎన్నికల్లో గుర్తుల్లో కారును పోలిన వాటిని కేటాయించవద్దని కోరిన బీఆర్ఎస్
BRS: కారును పోలిన గుర్తులపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది భారత రాష్ట్ర సమితి. కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. కారును పోలిన రోడ్డు రోలర్ వంటి గుర్తులతో ఎన్నికల్లో తమకు నష్టం వాటిల్లుతుందని పిటిషన్ లో తెలిపింది. బీఆర్ఎస్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
అయితే కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది బీఆర్ఎస్ పార్టీ. 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించినప్పటికీ.. మళ్లీ తిరిగి చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించవద్దని కోరింది.
కెమెరా, చపాతి రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు మిషన్, ఓడ, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులు EVMలలో కారు గుర్తును పోలినట్లు ఉన్నాయని.. ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది బీఆర్ఎస్. అటు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించవద్దంటూ కోరింది. ఇందువల్ల బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందని ఇటీవల ఎన్నికల సంఘానికి తెలిపింది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస వినతులపై ఎన్నికల సంఘం స్పందించచకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.