Bandi Sanjay: సంజయ్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం.. రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత
* మేయర్ విజయలక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు
Raj Bhavan: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మేయర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మహిళా నేతలంతా రాజ్‌భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది.
గవర్నర్.. తమకు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ స్పందించాలని కోరారు. ఎమ్మెల్సీ కవితకే కాదు.. మొత్తం మహిళా లోకానికే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. మహిళా నేతలు భారీగా చేరుకోవడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఒక దశలో మహిళలు రాజ్‌భవన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేయడంతో.. వినతిపత్రాలను గోడకు అంటించి నిరసన తెలిపారు.