ఖమ్మం హౌసింగ్ ప్లాట్లలో అక్రమార్కుల దందా

Update: 2020-09-19 09:30 GMT

ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో ప్లాట్ల కేటాయింపు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల విలువైన భూములను ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు అక్రమార్కులు స్వాహా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సొసైటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు వెలుగులో వస్తున్నాయి. టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో సాగించిన అక్రమ రిజిస్ట్రేషన్ల భూ దందా పై hmtv గ్రౌండ్ రిపోర్ట్.

ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారులు సమిష్టిగా నివాసం ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించారు. అన్నకున్నదే తడవుగా సొసైటీ ఫాం చేశారు. అదే టీఎన్జీవోస్‌ కో-ఆపరేటీవ్‌ హౌస్‌బిల్డింగ్‌ సొసైటీ. ఈ సొసైటీకి ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చింది. పైగా నామమాత్రపు ధరతో ప్రభుత్వ స్థలాన్ని అప్పగించింది. టీఎన్జీవోస్ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో కేవలం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే సభ్యులు. వారికి ఇంటి స్థలాలను కేటాయించేందుకు 2005లో జీవో నెంబర్‌ 144 ప్రకారం ఖమ్మం రూరల్‌ మండలంలోని 103 ఎకరాల 26 కుంటల ప్రభుత్వ స్థలాల్ని నామ మాత్రపు ధరకు ప్రభుత్వం సొసైటీకి అప్పగించింది. ఏదులాపురం పంచాయతీలో 54 ఎకరాల 15 కుంటల భూమి, దానవాయిగూడెం పంచాయతీ పరిధిలో 49 ఎకరాల 11 కుంటల భూమిని సొసైటీకి ఇచ్చింది ప్రభుత్వం.

నిబంధనల ప్రకారం సొసైటీలో 1686 మంది సభ్యులు ఉన్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగికి మాత్రమే ప్లాంట్ ను కేటాయించాలి. అయితే సొసైటీలోని నాయకులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అనర్హులకు సైతం కట్టబెట్టారు. ఈ క్రమంలో అన్యాయానికి గురైన కొందరు సభ్యులు ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో సొసైటీ ముసుగులో జరుగుతున్న అక్రమాల చిట్టా వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వం సొసైటీకి కేటాయించిన భూముల ధరలకు రెక్కలచ్చాయి. దీంతో 1686 మంది వాస్తవ సభ్యులకు అదనంగా మరో 1400 మందిని సభ్యులుగా చేర్పించారు కొందరు నాయకులు. అయితే అదనంగా 1400 మందికి ఎలా స్థలాలను కేటాయించగలిగారనే అంశం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వం సొసైటీకి ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న మరో 30 ఎకరాల స్థలాన్ని కూడా సొసైటీ నాయకులు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని సొసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. సొసైటీలోని కొందరు సభ్యులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు.

Full View


Tags:    

Similar News