బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ విచారణ మూడవ రోజు కొనసాగుతోంది. కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్ డేటా, సిమ్ లొకెషన్, సీసీ ఫుటేజీపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో భూమా విఖ్యాత్ పాత్రపై ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో నిన్న గోవాలో పట్టుకున్న సిధర్ అండ్ టీం ప్రమేయం పైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు శ్రీను, చంద్రహాస్, భార్గవ్ రామ్‌ల ఆచూకీపై అఖిలప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఈ కిడ్నాప్ వ్యవహారం బాలీవుడ్ మూవీ స్పెషల్ 26ని అనుకరించి ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. యూసఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌లో కిడ్నాప్ స్కెచ్ వేయగా వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కూల్‌లోనే మార్చినట్లు అధికారులు గుర్తించారు. స్కూల్ ప్రాంగణం నుంచి సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఏసీపీ, సీఐ, మహిళా సిబ్బంది సమక్షంలో మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.