Telangana: మరో ఉపఎన్నిక కోసం టీ బీజేపీ ప్లాన్ !?
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాజగోపాలుడికి గాలం వేయాలని చూస్తున్న కాషాయం క్యాంప్ కలసి వస్తున్న ఉపఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తోందా? హుజూరాబాద్‌లో గెలుపుతో మాంచి ఊపు మీదున్న కమలం పార్టీ రాజగోపాల్ కాన్సింటెన్సీపై కన్నేసిందన్న ఊహాగానాల్లో నిజమెంత? ఎక్కడికేం లేదు... అప్పుడే అక్కడి ఉపఎన్నికపై కసరత్తు కూడా మొదలుపెట్టిందా? కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉంటూ అంటీ ముట్టనట్టు ఉంటున్న రాజగోపాల్ నియోజకవర్గానికి బైపోల్ వస్తే ఏం చేయాలన్న దానిపై బీజేపీ వ్యూహరచన చేస్తోందా? ఇంతకీ కమలం కౌంటర్ ఏంటి? కాంగ్రెస్ ఎటాక్ ఏంటి?
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నది పెద్దలు చెప్పే ఓ సామెత. అచ్చంగా ఇదే తెలంగాణ బీజేపీ అచ్చొచ్చినట్టే కనిపిస్తుందన్న టాక్ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటే దక్కించుకున్న బీజేపీ, రెండున్నరేళ్లు గడిచే వరకు తన సంఖ్యను మూడుకు పెంచుకుంది. అది కూడా రెండు సీట్లలో పాగా వేసిన అధికార పార్టీని ఖంగుతినిపించి మరీ తమ ఖాతాలో వేసుకుంది. ఒకటి దుబ్బాక, రెండోది హుజూరాబాద్. ఈ రెండు స్థానాల్లో కమలం పార్టీ పాగా వేయడంతో ఉపఎన్నికలు బీజేపీకి కలసి వస్తున్నాయన్న సరికొత్త చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది.
దుబ్బాక నుంచి కలసి వస్తున్న కాలాన్ని ఇలాగే సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న కమలం పెద్దలు ఊహించని హుజూరాబాద్‌లో బంపర్ మెజారిటీని సాధించింది. ఇలా సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే కమలనాథులు బైపోల్స్ తమకు బాగా కలసి వస్తాయని నమ్ముతున్నారట. అందుకే కమలం పార్టీ వ్యూహకర్తలు, ముఖ‌్య నాయకులు కొందరు మరో రెండు ఉపఎన్నికలపై కన్నేశారట. ఈ చర్చే ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కమలంతోనే తెలంగాణకు భవిష్యత్ అంటూ తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతి కొండపైనే చెప్పారు.
ఏడాది నుంచి కమలంతో అంటకాగుతున్న రాజగోపాల్‌రెడ్డి అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి గనుక కమలం క్యాంప్‌లో చేరితే తన ఎమ్మెల్యే పదవికి రాజినామా చేస్తారని, కచ్చితంగా మునుగోడులో ఉపఎన్నిక వస్తుందని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. అప్పుడు బీజేపీ అభ్యర్థి రాజగోపాలే అవుతాడు కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని కమలం అనుకుంటుందట. ఆ ఆలోచనతోనే కాషాయం క్యాంప్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుక్ పర్యటనలో కూడా పార్టీ నేతలు కొందరు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే ఇంకో సీటు తమ ఖాతాలో పడటం వందకు వంద శాతం అవుతుందని కమలం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారట.
కానీ, ఇప్పటివరకు రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామాపై ఎక్కడ కూడా ఓపెన్‌గా కామెంట్ చేయలేదు. వీలున్నప్పడుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని పొగడడం తెలంగాణలో టీఆర్ఎస్ ఆల్టర్‌నేటివ్‌గా బీజేపీ ఎదుగుతుందని చెప్పడం తప్పిస్తే కమలం తీర్థం పుచ్చుకుంటానని ఏనాడూ చెప్పలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరోసారి ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తేల్చి చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చన్న ప్రచారాల మధ్య ఈ కొద్దికాలానికే మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లడం, ఆ ఆర్థికభారం మోయడం కంటే, ఎన్నిక వరకు ఆగి నాటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనే యోచనలో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అదీగాక, రాజగోపాల్ కుమారుడు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్న కోమటిరెడ్డి కుటుంబం ఈ రాజకీయాలపై పెద్ద కాన్సంట్రేషన్ కూడా చేయడం లేదట.
ఇక తెలంగాణ బీజేపీ భారీగా ఆశలు పెట్టుకున్న వేములవాడ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై కేసుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. వాయిదాలపై వాయిదాలు నడుస్తున్నాయి. తీర్పు ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారట. మరి ఈ రెండు ఉపఎన్నికలపై కన్నేసిన కమలం పార్టీ తన ప్లాన్‌ను ఎలా వర్కవుట్ చేస్తుందో చూడాలి.