ఎస్‌ఈసీ పార్థసారధికి, డీజీపీకి బీజేపీ విజయాన్ని అంకితం చేస్తున్నా : బండి సంజయ్
తాజాగా వెలువడిన గ్రేటర్ ఎన్నికల్లో 49 సీట్లను సాధించడం పట్ల తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంబరాలు నెలకొన్నాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ 49 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్‌లో సత్తా చాటింది.
తాజాగా వెలువడిన గ్రేటర్ ఎన్నికల్లో 49 సీట్లను సాధించడం పట్ల తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంబరాలు నెలకొన్నాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ 49 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్‌లో సత్తా చాటింది. ఈ సందర్బంగా బండి సంజయ్‌ను బీజేపీ నేతలు అభినందించారు. బండి సంజయ్ బీజేపీని మరింత విజయతీరాలకు తీసుకెళ్లారంటూ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తేలిపారు. అండగా నిలిచిన బీజేపీ అగ్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాని, ఎస్‌ఈసీ పార్థసారధికి, డీజీపీకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్టుగా తెలిపారు. బండి సంజయ్‌తో పాటుగా కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకొని కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనకు గ్రేటర్ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం మైత్రిని ప్రజలు తిరస్కరించారని, ఇది బీజేపీ నైతిక విజయమేనని అన్నారు. ఈ గ్రేటర్ తీర్పు టీఆర్ఎస్ పతనానికి నాంది అని, కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్‌పై వ్యతిరేకంగా ఉన్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అటు డీకే అరుణ మాట్లాడుతూ.. గ్రేటర్ ప్రజల తీర్పే మార్పునకు రుజువని అన్నారు. టీఆర్ఎస్‌కు ఇక కాలం చెల్లినట్లేనని, కేసీఆర్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని అన్నారు.