గ్రేటర్‌లో బీజేపీకి... ఫ్లోర్ లీడర్ కావలెను!
Hyderabad: జీహెచ్ఎంసీలో కమలనాథులకు ఓ ఫ్లోర్ లీడర్ కావాలట.
Hyderabad: జీహెచ్ఎంసీలో కమలనాథులకు ఓ ఫ్లోర్ లీడర్ కావాలట. గ్రేటర్ పాలకమండలి ఏర్పాటు జరిగి ఏడాది గడుస్తున్నా.. బీజేపీకి ఫ్లోర్ లీడర్లే దొరకడం లేదట. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 మంది కార్పొరేటర్‌లు గెలిచినా... గ్రేటర్ ఆఫీస్‌లో వారిని లీడ్ చేసే లీడరే కనిపించడం లేదట. ఈసారి అవకాశం సీనియర్లకు ఇవ్వాలా... జూనియర్లకు కట్టబెట్టాలా? అన్న కన్ఫ్యూజన్‌లో కాషాయం క్యాంప్ క్లారిటీ మిస్సవుతోందట. హైదరాబాద్ నేతల అభ్యంతరాలతో ఫ్లోర్‌లీడర్ ఎంపికను అలా అటకెక్కించిన అధిష్టానంపై కమలం కార్పొరేటర్లు ఏమంటున్నారు?
కిందటేడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీని, కమలనాథులు ఖంగు తినిపించారు. హైదరాబాద్‌లో ఒక, ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం ఉన్న బీజేపీ ఎంఐఎం, టీఆర్ఎస్ కంచుకోటలను బద్దలు కొడుతూ తన సత్తా చాటింది. ఎవరూ ఊహించని విధంగా 48 డివిజన్ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటామని, అధికార పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడతామంటూ అప్పట్లో కమలనాథులు అబ్బో చాలానే చెప్పారు లే!! కానీ, ఇంతవరకు గ్రేటర్‌లో గెలుపొందిన కార్పొరేటర్లను లీడ్ చేసేందుకు ఓ ఫ్లోర్‌లీడర్‌ను మాత్రం ఎంపిక చేయలేకపోతోంది. ఆచితూచి వ్యవహరిస్తోంది.
ఫ్లోర్‌లీడర్ కోసం ఎంతోమంది రెడీగా ఉన్నారు. కమలం నుంచి గెలిచిన వారే కాకుండా ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎంతో మంది కార్పొరేటర్లు ఖర్చీఫ్ వేసుకొని కూర్చుకున్నారు. అయితే, ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్న కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం అడుగు ముందుకు వేయాలంటే ఆలోచిస్తోందట. ముఖ్యంగా కొత్త, పాత నేతల మధ్య ఎలాంటి పొరపచ్చాలు రాకుండా సమన్వయం కోసం ప్రయత్నిస్తోందట. ఫ్లోర్‌లీడర్ ఎంపికకు ఇప్పుడే అంత తొందర ఎందుకులే అన్నట్టుగా ఉన్నారట ముఖ్యనేతలు. కరోనా పేరుతో జీహెచ్ఎంసీ సమావేశాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ అంశానికి అంతగా పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారట. అయితే కార్పొరేటర్‌లుగా గెలుపొందిన నాయకులు ఫ్లోర్‌లీడర్‌పై పెట్టుకున్న ఎన్నో ఆశలను ఇలా నీరుగార్చడం కరెక్ట్ కాదంటూ కమలం కార్పొరేటర్లు పెద్దల ముందు వాపోతున్నారట. ఏడాది గడిచినా ఇంకా వాయిదా వేయడం, ఇప్పుడంతా తొందరేంటిలే అన్నట్టు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఫ్లోర్‌లీడర్ ఎంపిక విషయం ఇక్కడి వారితో కాదులే అని డిసైడ్ అయిన కార్పొరేటర్లు మొన్నీ మధ్య రాష్ట్ర కార్యాలయంలో ఇన్‌చార్జ్ తరుణ్‌చుక్‌తో జరిగిన సమావేశంలోనూ ప్రస్తావించినట్టు తెలిసింది. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాదాధీరజ్‌రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసుధన్‌రెడ్డిలు ఫ్లోర్‌లీడర్ పదవి కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే, ఫ్లోర్‌లీడర్ ఎంపికపై కార్పొరేటర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అధినాయకత్వం వాటిని సీల్డ్ కవర్‌లో భద్రపరిచారన్న చర్చ జరుగుతోంది. అయితే, బండి సంజయ్ రాష్ట్ర పనుల్లో బిజీగా ఉండటం వల్లా ఆయన నిర్ణయం తీసుకోవడం వల్ల ఫ్లోర్‌లీడర్ ఎంపిక ఆసల్యమవుతుందని ప్రచారం నడుస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఫ్లోర్‌లీడర్ ఎంపికలో ఎన్నో అభ్యంతరాలను తెరపైకి తెచ్చారనీ, అదీగాక, లక్ష్మణ్, బండారు దత్తాత్రేయలాంటి సీనియర్లు ఈ ఇష్యూను పదేపదే కల్పించుకోవడం వల్ల కూడా ఎంపికపై క్లారిటీ రావడం లేదట. ఏమైనా ఒకవేళ ఫ్లోర్‌లీడర్‌ను ఎంపిక చేయాల్సి వస్తే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎవరి పేరు చెబితే వారు కన్ఫామ్ అవుతారని పార్టీలో చర్చ సాగుతోంది.
మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటామని, అధికార పార్టీని ఓ ఆట ఆడుకుంటామని గొప్పలు చెప్పిన కమలం నేతలు కీలకమైన ఫ్లోర్‌లీడర్‌నే ఎంపిక చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగూ అందరినీ సాటిస్‌ఫై చేయడం ఇంపాజిబుల్ కాబట్టి అందరిని కలుపుకుపోయే నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంచనాతో కమలం క్యాంప్ ఉంటే, ఈ ఎంపిక ఎంత ఆలస్యం చేస్తే అంత పార్టీకే నష్టమన్న అంచనాలో కార్పొరేటర్లు ఉన్నారట. ఎవరెన్ని చెప్పినా డిసిషన్ తీసుకునేది పార్టీ అధినాయకత్వమే. మరి ఈ ఇష్యూని ఎప్పుడు తేలుస్తుందో చూద్దాం.