గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కిషన్ రెడ్డి
దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ అదే పంథాను కొనసాగించాలనుకుంటోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా జీహెచ్‌ఎంసీ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని భావిస్తోంది. 80 స్థానాలకు పైగా విజయమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. దీని కోసం రాష్ట్ర, జాతీయ పార్టీ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ చైర్మన్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కన్వీనర్ గా లక్ష్మణ్, కో కన్వీనర్లుగా వివేక్ వెంకట స్వామి, గరికపాటి మోహన్, చింతల రామచంద్రారెడ్డిలను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా అఖిలేష్ షెల్లర్, సభ్యులుగా గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్, కర్నాటకకు చెందిన సతీష్ రెడ్డి లను నియమించింది.
గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్. ప్రతి డివిజన్‌లో పాదయాత్ర ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు. కేటీఆర్ ఎన్నికల తాయిలం ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. వరదలతో హైదరాబాద్ తల్లడిల్లుతుంటే కనీసం ముఖ్యమంత్రి బయటకు రాలేదని ఆరోపించారు. వరద సాయాన్ని బాధితులకు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ జేబుల్లో పెట్టుకున్నారని విమర్శలు చేశారు.
వరద బాధితుల పేరుతో 475 కోట్లను మింగేశారని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. మిగిలిన 75 కోట్ల పంపిణీకి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను IL and FS కంపెనీకి అప్పగించడాన్ని తప్పుపట్టారు రామచందర్. నాగాలాండ్‌లో 17 వందల కోట్ల స్కాం ఈ కంపెనీ చేసిందని రాజస్థాన్‌లో కూడా అవినీతికి పాల్పడిందన్నారు. IL and FS కంపెనీపై కేసులున్నాయన్న రామచందర్ అలాంటి కంపెనీకి ధరణి పోర్టల్ ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించారు.
మొత్తానికి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన తర్వాత బీజేపీ నాయకులు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. మరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే.