VamanRao murder case: బిట్టు నుంచి కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు
Telangana: నిందితులకు ఆయుధాలు సమకూర్చాడని బిట్టు శ్రీనుపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించి న్యాయవాదుల జంట హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక నిందితుడు బిట్టును పోలీసులు అరెస్ట్ చేశారు. లాయర్ దంపతుల(VamanRao) హత్యకు పాల్పడిన దుండగులకు బిట్టు శ్రీను ఆయుధాలను, వాహనాలను సప్లై చేశాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు.. బిట్టు శ్రీను మాజీ ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్ పుట్ట మధుకు స్వయానా మేనల్లుడుగా తెలుస్తోంది. వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పటి నుంచీ బిట్టు కనిపించకుండా పోవడంతో అతడిపై వచ్చిన ఆరోపణలు మరింత బలపడ్డాయి. ఇలాంటి సమయంలో బిట్టునపు అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలను కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఇద్దరిని మహారాష్ట్ర సరిహద్దులో, మరొకరిని గోదావరిఖనిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం అరెస్టయిన బిట్టు శ్రీను సహా ముగ్గురినీ పోలీసులు వేరు వేరుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. స్వగ్రామంలో వివాదాల కారణంగానే ఈ హత్యలు చేయించినట్లు చెప్పిన కుంట శ్రీను.. తర్వాత పోలీసుల విచారణలో బిట్టు శ్రీను పేరు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులను ఇవాళ మంథని కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.