బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలుగ ఉన్న అఖిలప్రియకు సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఆర్డర్ కాపీలను చంచల్‌గూడ జైలు అధికారులకు ఆమె తరపు న్యాయవాదులు సమర్పించారు. అనంతరం ఆమెను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. అఖిల ప్రియ విడుదలతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హఫీజ్‌పేటలోని భూవివాదం నేపథ్యంలో ప్రవీణ్‌రావు, సునీల్ రావు, నవీన్‌రావు అనే ముగ్గురు సోదరుల కిడ్నాప్‌పై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దీనిలో భాగంగా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.