Bhadradri: శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైన భద్రాద్రి
Bhadradri: అంగరంగ వైభవంగా తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు
Bhadradri: హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండగల్లో శ్రీ రామ నవమి ఒకటి. రామనవమి అంటేనే ఊరూ వాడా సంబరం..ఇక తెలుగువారి అయోధ్య భద్రాద్రి.. శ్రీ రామ నవమి వేడుకలకు సిద్దమైంది. రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీ రామ నవమి వేడుకలను పురష్కరించుకుని ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.
ఉగాది రోజు తిరువీడి సేవతో మొదలైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది. ఇప్పటికే భక్తుల కోసం ఆన్‌లైన్లో .. కౌంటర్ల వద్ద కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 17న శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న శ్రీరామ నవమి, సీతారాముల కల్యాణ ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక ఆల నేడు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.